సంక్రాంతికి సస్పెన్స్‌ .. శివరాత్రికి సీటీమార్‌

ABN , First Publish Date - 2022-03-06T05:37:21+05:30 IST

సంక్రాంతికి అంతటా సినీ పరిశ్రమలో కరోనా గురించిన

సంక్రాంతికి సస్పెన్స్‌ .. శివరాత్రికి సీటీమార్‌

సంక్రాంతికి అంతటా సినీ పరిశ్రమలో కరోనా గురించిన చర్చేనెలన్నర గడిచింది... శివరాత్రి వచ్చేసరికి చిత్రసీమలో కరోనా ఊసే లేకుండా పోయింది. ‘ఇంతలో ఎంత మార్పు’ అని కూడా అనుకునేంత తీరిక లేకుండా కొత్తసినిమాల షూటింగ్స్‌, రిలీజ్‌లతో టాలీవుడ్‌ పండగ చేసుకుంటోంది. ఈ ఏడాది శివరాత్రితో కరోనాకు వీడ్కోలు పలుకుతూ చేదు జ్ఞాపకాలను పక్కనపెట్టి కొత్త ఆశలతో పరిశ్రమ దూసుకెళుతోంది. 


సినిమా విడుదలకు సరైన తరుణం కోసం నిర్మాతలు వేచిచూస్తున్న సమయంలో ఊహించని విధంగా జనవరి నెలాఖరుకల్లా ఒమిక్రాన్‌ వ్యాప్తిపై క్లారిటీ వచ్చింది. ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ దిశగా ఆలోచించలేదు. క్రమంగా కరోనా వ్యాప్తి నెమ్మదించడం, ఓమిక్రాన్‌ ప్రభావం అంతగా లేకపోవడంతో జనవరి నెలాఖరు నుంచి సినిమాల విడుదలకు ఊపు వచ్చింది. అప్పటిదాకా వెనకాడిన నిర్మాతలు వెంటనే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పలు చిత్రాలు విడుదలకు సిద్ధమై ఉండడంతో రిలీజ్‌ డేట్ల క్లాష్‌ వచ్చింది. ఫిబ్రవరి తొలి వారం నుంచి కరోనా ప్రభావం సినిమాల విడుదలపై నామమాత్రంగా కూడా కనిపించలేదు. ప్రవాహంలాగా సినిమాలు ఒకదాని వెంట మరొకటి థియేటర్లలోకి రావడం మొదలైంది.




ఫిబ్రవరి 11న రవితేజ ‘ఖిలాడి’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. కరోనా భయాల నుంచి బయటకొచ్చాక పరిశ్రమ నుంచి తొలిసారి వచ్చిన పెద్ద రిలీజ్‌ ఇదే. సినిమాలో పసలేక ప్లాప్‌గా నిలిచింది. ఆ మరుసటి రోజు విడుదలైన ‘డీజే టిల్లు’ కలెక్షన్ల మోత మోగించింది. చిన్న చిత్రం పెద్ద విజయాన్నే నమోదు చేసింది. ఫిబ్రవరి మూడో వారంలో కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలేవి పోటీలో లేకపోయునా ప్రేక్షకులు వాటిని ఆదరించలేదు.




కరోనా కథ ముగిసింది!

అయితే ఫిబ్రవరి ఆరంభమే బాక్సాఫీసుకు కొత్త కళ మొదలైంది. కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు తప్పింది. సినిమాలు వరుసకట్టి థియేటర్లలో విడుదలయ్యాయి. డేట్లు దొరక్క సినిమాల మధ్య పోటీ పెరిగింది. కొన్ని సినిమాల విడుదల వాయిదా పడింది. మొత్తానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. 

సంక్రాతి రేస్‌లో నిలిచి వెనక్కి వెళ్లిన ‘భీమ్లానాయక్‌’ బాక్సాఫీసు దగ్గర పవన్‌ స్టామినాను మరోసారి ఫ్రూవ్‌ చేసింది. కరోనా భయాలు పోయి ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో సడెన్‌గా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసి వారం వ్యవధిలోనే ‘భీమ్లానాయక్‌’ను బరిలోకి దింపారు. బాక్సాఫీసు దగ్గర పవన్‌ స్టామినాను మరోసారి తారాపథంలో నిలిపింది ఈ చిత్రం. రానా, పవన్‌ పోటాపోటీ నటన, త్రివిక్రమ్‌ కలం బలం వెరసి అభిమానులకు మంచి ట్రీట్‌ ఇచ్చాయి. 



సినిమా రాత ‘మార్చి’ంది

మార్చి తొలివారంలో ‘సెబాస్టియన్‌ పిసి524’ కొత్త తరహా కథాంశంతో వచ్చింది. అయితే కథనంలో పట్టుతప్పి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్‌ అయింది. గత రెండేళ్లుగా వెంటడుతున్న కరోనా భయాలను వదిలి పరిశ్రమ పండుగ చేసుకుంది. అప్పటినుంచి సినిమా షూటింగ్స్‌, విడుదలపైనే ఫోకస్‌ అంతా ఉంటోంది. మొత్తంమీద శివరాత్రి సీజన్‌తో చిత్ర పరిశ్రమ కరోనా కాలపు గాయాలను మాన్పుకొందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రథమార్థమే టాలీవుడ్‌కు మంచి హిట్లు పడ్డాయి. మార్చి నుంచి ఇక అంతా మంచి కాలమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.




ఫిబ్రవరి ఆరంభం నుంచి బాక్సాఫీసుకు కొత్త కళ మొదలైంది. కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు తప్పింది. సినిమాలు వరుసకట్టి థియేటర్లలో విడుదలయ్యాయి. డేట్లు దొరక్క సినిమాల మధ్య పోటీ పెరిగింది.వరుసగా రెండేళ్ల పాటు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సంబరాలను దూరం చేసింది కరోనా. వసూళ్లకు ఆయువుపట్టుగా నిలిచే సంక్రాంతి సీజన్‌ ఈ ఏడాది టాలీవుడ్‌కు నిరాశనే మిగిల్చింది. 

ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులతో అలజడి మొదలై  సినిమాలు సంక్రాంతికి విడుదల చేయాలా, వద్దా అనే ఊగిసలాటలో నిర్మాతలను పడేసింది. సంక్రాంతిని వదులుకోకూడదని భావించిన పాన్‌ ఇండియా చిత్రాల మేకర్స్‌ కూడా చివరకు చేతులెత్తేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ లాంటి భారీ చిత్రాలూ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లాయి. కరోనా గత అనుభవాలను తలచుకొని సినిమా రిలీజయ్యాక వసూళ్లపైన ప్రభావం చూపితే నష్టపోవాల్సిందనే భయాలు నిర్మాణ సంస్థలను ఆలోచనలో పడేశాయి.  2022లో ఏం జరుగబోతుందో, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో అనే ఆందోళనలో పరిశ్రమ పడింది. 




దీంతో మీడియం బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలు కూడా థియేటర్లలోకి వచ్చే సాహసం చేయలేదు. సంక్రాంతికి అటూ ఇటుగా రిలీజ్‌ డేట్స్‌ను ప్రకటించిన అగ్ర చిత్రాలు కూడా విడుదలను వాయిదా వేసుకున్నాయి. చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ నటించిన ‘ఎఫ్‌ 3’, వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా నటించిన ‘గని’, పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’ కూడా రిలీజ్‌ రేస్‌లో వెనక్కు జరిగాయి. దీనికి పూర్తిగా కరోనా కారణం కాదు. ఏ పరిస్థితుల్లో అయినా తమ సినిమాలను సంక్రాంతి సమయంలో రిలీజ్‌ చేయాలనేపట్టుదలలో కొందరు నిర్మాతలు ఉన్నారు. అయితే పాన్‌ ఇండియా చిత్రాల పేరు చెప్పి వాటి రిలీజ్‌ను వాయిదా వేసేలా చేశారు. 

 


ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూతో రాత్రి షోకి కత్తెర వేయడం కూడా ఆందోళన పెంచింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం థియేటర్లపై ఆంక్షలు విధించబోమని ప్రకటించడం ఊరట నిచ్చినా భవిష్యత్‌ పై ఆందోళన మాత్రం తగ్గలేదు. 


ఫలితం సంక్రాంతికి ‘బంగార్రాజు’ ఒక్కరే సోలో పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఆశిష్‌ కథానాయకుడిగా నటించిన ‘రౌడీ  బాయ్స్‌’ యువతను మాత్రమే ఆకట్టుకొని యావరేజీ అనిపించుకుంది. భారీ నిర్మాణ విలువలు, మంచి హైప్‌తో వచ్చిన అశోక్‌ గల్లా ‘హీరో’ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో థియేటర్లలో ‘బంగార్రాజు’కు ఎదురులేకుండా పోయింది. 


Updated Date - 2022-03-06T05:37:21+05:30 IST