ఫొటోగ్రాఫర్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-23T06:47:09+05:30 IST

రోడ్డు పక్కన మద్యం సేవిస్తూ దారిన వెళుతున్న కారు ను ఆపి అందులో వారితో గొడవపడి ఒకరిని హత్య చేసి, మరొకరిని తీవ్రంగా గాయపరచిన ఘటనలో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్టు సీఐ కె.వెంకటేశ్వరరావు తెలిపారు.

ఫొటోగ్రాఫర్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్వరరావు

నిడదవోలు, జనవరి 22: రోడ్డు పక్కన మద్యం సేవిస్తూ దారిన వెళుతున్న కారు ను ఆపి అందులో వారితో గొడవపడి ఒకరిని హత్య చేసి, మరొకరిని తీవ్రంగా గాయపరచిన ఘటనలో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్టు సీఐ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం నిడదవోలు సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవ్వూరు మండలం ఆరికరేవుల గ్రామానికి చెందిన జొన్నకూటి రవీంద్రబాబు తన కుమారుడి పుట్టినరోజుకు తన బావ మరిదిని పిలవడానికి ఈ నెల 15న చాగల్లు వచ్చి అక్కడ తన బంధువులతో గొడవపడ్డాడన్నారు. కొవ్వూరులోని తన స్నేహితులైన తాలపాకల ఉదయ్‌కిరణ్‌, కామన శ్రీనివాస సాయికుమార్‌,  తిరిగిపల్లి సుమంత్‌, సవరపు సుమిత్‌రత్నం, సవరపు సందీప్‌, సారిపల్లి రాజేష్‌, పంపని శ్రీనివాస్‌, గారపాటి లక్ష్మీ గణపతిని పిలిపించి  గొడవకు దిగగా పెద్దలు రాజీ కుదిర్చా రన్నారు. అనంతరం వీరంతా  చాగల్లు శివారు బ్రిడ్జిపై మద్యం తాగుతూ కారులో వెళుతున్న ఫొటో గ్రాఫర్‌ మాచవరపు సురేష్‌కుమార్‌, వీర్ల రామకృష్ణతో గొడవపడి వారిపై కత్తితో దాడి చేయగా సురేష్‌ కుమార్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా వీర్ల రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.  21న కొవ్వూరు మెరక వీధి వద్ద నిందితులు 9 మందిని అరెస్టు చేశామని, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. కేసు త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినందుకు తనతోపాటు చాగల్లు ఎస్‌ఐ సీహెచ్‌వి రమేష్‌, సిబ్బందిని డీఎస్పీ  శ్రీనాథ్‌, ఎస్పీ శర్మ ప్రత్యేకంగా అభినందించినట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2022-01-23T06:47:09+05:30 IST