‘అనుమానాస్పదం’

ABN , First Publish Date - 2022-05-21T07:14:03+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) తన మాజీ డ్రైవర్‌ మృతదేహాన్ని సొంత కారులో తరలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెబుతున్న డ్రైవర్‌ మృతదేహాన్ని మృతుడి ఇంటి వద్ద ఉదయభాస్కర్‌ దించడం, ఆ తర్వాత తన సొంత కారును అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోవడం, శుక్రవారం అంతా అనంతబాబు అజ్ఞాతంలో ఉండడం కలకలం రేపుతోంది.

‘అనుమానాస్పదం’
ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేసేదాకా సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తరలించవద్దంటూ కారుకు అడ్డుగా కూర్చున్న తల్లి, భార్య..

  • వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్‌ మృతి
  • రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పిన ఎమ్మెల్సీ
  • అర్ధరాత్రి ఆసుపత్రికి పిలిచి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని చూపించిన వైనం
  • ఆనక మృతదేహాన్ని తన కారులో వారి అపార్టుమెంటు  వద్దకు తీసుకువెళ్లి అప్పగింత
  • పథకం ప్రకారమే అనంతబాబే చంపేశాడని భార్య, తల్లిదండ్రుల ఆరోపణలు
  • ఎమ్మెల్సీని అరెస్టు చేసే వరకు పోస్టుమార్టం వద్దని ఆందోళన.. సంతకాలకు నిరాకరణ
  • ప్రమాద ఘటన, ఆసుపత్రి వద్ద సీసీటీవీ ఫుటేజీలు ఏమైనట్టు.. స్పందించని పోలీసులు

కాకినాడలో మరో సంచలనం. మొన్నటికి మొన్న సర్పవరం ఎస్‌ఐ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేయగా, తాజాగా ఇప్పుడు మరో అనుమానాస్పద మృతి ఘటన జిల్లాలో  పెను సంచలనమైంది. ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) తన మాజీ డ్రైవర్‌ మృతదేహాన్ని సొంత కారులో తరలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెబుతున్న డ్రైవర్‌ మృతదేహాన్ని మృతుడి ఇంటి వద్ద ఉదయభాస్కర్‌ దించడం, ఆ తర్వాత తన సొంత కారును అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోవడం, శుక్రవారం అంతా అనంతబాబు అజ్ఞాతంలో ఉండడం కలకలం రేపుతోంది. మృతివెనుక ఎమ్మెల్సీ పాత్ర ఉందని కుటుంబీకులు ఆరోపణలు చేయడంతో వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రోడ్డు ప్రమాదమా? హత్య? అనేది సస్పెన్స్‌గా మారింది. 

కాకినాడ (ఆంధ్రజ్యోతి)/ కాకినాడ క్రైం :

పెదపూడి మండలం గొల్లలమామిడాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం (23) కాకినాడలోని కుళాయిచెరువు వద్ద ఉన్న ఒక అపార్టుమెంటులో ఉంటున్నాడు. ఈయనకు భార్య అపర్ణ, తండ్రి సత్తిబాబు, తల్లి నూకరత్నం, సోదరుడు నవీన్‌ ఉన్నారు. సుబ్రహ్మణ్యం అయిదేళ్లుగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్య కారణాలతో సుబ్రహ్మణ్యం ఇటీవల ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్‌గా పనిచేయడం మానేశాడు. గురువారం తన పుట్టినరోజు కావడంతో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ కాకినాడ వచ్చాడు. రాత్రి 9.30 గంటలకు మణికంఠ అనే యువకుడి ద్వారా సుబ్రహ్మణ్యాన్ని ఉదయభాస్కర్‌ కొండ య్యపాలెం ప్రాంతానికి రప్పించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో అర్ధరాత్రి 12.50 గంటలకు సుబ్రహ్మణ్యం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇదే విషయాన్ని ఉదయభాస్కర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి నాగమల్లితోట జంక్షన్‌ వద్ద బైక్‌ తో డివైడర్‌ను ఢీకొట్టి చనిపోయాడని వివరించారు. ఈ ప్రమా దం విషయాన్ని తనకు ఓ స్నేహితుడు చెప్పాడని, సంఘటనా స్థలానికి కారులో వెళుతున్నానని కుటుంబ సభ్యులకు వివరించా డు. కాసేపటి మళ్లీ ఫోన్‌ చేసి తాను అమృత ఆసుపత్రి దగ్గర ఉన్నానని అక్కడకు రావాలని కుటుంబీకులకు చెప్పాడు. అక్కడ కు చేరుకుని కుమారుడు విగతజీవిగా కారులో పడి ఉన్నట్టు గుర్తించి షాక్‌కు గురయ్యామని తల్లిదండ్రులు వాపోయారు. డాక్టర్‌ పరీక్షించి మృతి చెందినట్టు చెప్పగా, అక్కడ నుంచి అదే కారులో మృతదేహంతోపాటు తమను తమ నివాసం ఉన్నచోటు కు తీసుకొచ్చిన ఎమ్మెల్సీ అక్కడ నుంచి ఉడాయించినట్టు ఆరో పించారు. అయితే ఈ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మృతదేహాన్ని కారులో తీసుకువచ్చిన ఎమ్మెల్సీ ఉద యభాస్కర్‌ ఆ తర్వాత కారు అక్కడ వదిలేసి వెళ్లిపోవడం, రోడ్డు ప్రమాదం నిజమే అయితే అక్కడే ఉండకుండా, మరుసటి రోజు కుటుంబానికి అండగా ఉండకుండా ఎందుకు పరారయ్యాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క కారు తాళాలు లేకపోవడంతో పోలీసులు బలవంతంగా అద్దాలు తెరిచి చూశా రు. అయితే కారు వెనుక సీటులో మృతదేహాన్ని ఉంచిన చోట మట్టి, బురద ఉంది. కనీసం చిన్నరక్తపు ఆనవాళ్లు లేవు. దీంతో కాకినాడ బీచ్‌ ప్రాంతంలో ఏదొకచోట నిర్జీవ ప్రదేశంలో వాదు లాటలో కిందపడేసి ఎవరో తొక్కి చంపారనే అనుమానాలు ప్రాథమికంగా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పినట్టు ఇది రోడ్డు ప్రమాదమే అయితే ప్రమాదం జరిగిందని చెబుతున్న ప్రాంతంలో ప్రమాదానికి గురైన బైక్‌, కారు ఏదీ లేదు. అలాగే ప్రైవేటు ఆసుపత్రికి మృతుడిని తీసుకువెళ్తే కింద కు వచ్చిన వైద్యుడు కారులో ఉన్న వ్యక్తి చనిపోయాడని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కానీ ఏదైనా ఆసుపత్రికి వెళ్తే ఐసీయూకి తరలిం చిన తర్వాతే వైద్యులు వచ్చి చూస్తారు. కారు వద్దకు వచ్చి పరీ క్షించరు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్దకు కారులో ఎమ్మెల్సీ వచ్చిన సీసీటీవీ ఫుటేజీలు బయట పెట్టాల్సి ఉంది. కానీ ఆసు పత్రి, పోలీసు వర్గాలు ఈ విషయం పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదం అని చెబుతున్న మాటలు నమ్మశక్యంగా కనిపించడం లేదు. మరోపక్క మృతుడి ఒంటిపై ఎలాంటి రక్తపు ఆనవాళ్లు లేవు. కాళ్లు, పెదాలు, తలపై గాయాలున్నాయి. శరీరం కమిలిపోయింది. దీన్నిబట్టి ఇసుకలో పడేసి బలంగా తొక్కి చం పారని కొందరు వైద్యులు అనుమానిస్తున్నారు. కాగా ఈ అను మానాస్పద మృతి వెనుక వివాహేతర సంబంధ వ్యవహారం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా అనుమానాస్పద మృతికి సంబంధించి గురువారం అర్ధ రాత్రి మృతుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే టూటౌన్‌, సర్పవరం పోలీసులు శుక్రవారం ఉదయం 11 వరకు ఫిర్యాదు తీసుకోలేదు. అటు శుక్రవారం రాత్రి పన్నెండు దాటినా అనుమానితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. ఇక రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోతే నేరుగా ఇంటికి తీసుకు వెళ్ల డానికి లేదు. పోలీసులకు సమాచారం ఇచ్చి జీజీహెచ్‌కు తర  లించి పోస్టుమార్టం తర్వాత కుటుంబీకులకు అప్పగిస్తారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ పోలీసులు లేదా 108కు సమాచారం ఇవ్వకుండా ఎందుకు తన కారులో ఎందుకు మృతదేహాన్ని తరలించారనేది అనుమా నాస్పదంగా ఉంది. కాగా మృతుడి ఇంటివద్ద ఉన్న అనంతబాబు కారుకు తాళాలు లేకపోవడంతో పోలీసులు దీన్ని అతికష్టంపై కదిల్చే ప్రయత్నం చేశారు. దీన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించనున్నారు. ఈ ఐ20 కారుపై ఎమ్మెల్సీ అనంతబాబు అని ఉంది. కాగా ఈ ఘటనపై జిల్లా అద నపు ఎస్పీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు గురు వారం అర్ధరాత్రి అమృత ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ ఫోన్‌ చేయడంతో వెళ్లి అక్కడ తన కొడుకు మృతదేహాన్ని చూశామని చెప్పా రని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోపక్క మృతదేహాన్ని బంధువులు జీజీహెచ్‌కు తరలించకుండా అడ్డుకున్నారు. వీరిని పోలీసులు పక్కకు ఈడ్చేసి పోస్టుమార్టానికి తరలించారు. దీంతో  మృతుడి భార్య అపర్ణ మాట్లాడుతూ తాను అయిదో నెల గర్బిణీ అని, తన భర్తను పొట్టన పెట్టుకున్నారని విలపిస్తూ చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ ఈమె జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరుగుతున్న ప్రాంతం వద్ద ఆం దోళనకు దిగారు. టీడీపీ నేతలు రాజప్ప, కొండబాబు, జ్యోతుల నవీన్‌, పావని తదితరులు లోపలకు వెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులు ససేమిరా అన్నారు. కాగా బాధిత కుటుంబాన్ని రాజప్ప ఇతర నేతలు పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. లోకేష్‌ ఫోన్‌లో మాట్లాడి మృతుడి భార్యకు ధైర్యం చెప్పారు. కాగా డ్రైవర్‌ను కొట్టి చంపేశారని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆరోపించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసేవరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి అంగీకరించమని చెప్పారు. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మేయర్‌ సుంకర పావనితిరుమలకుమార్‌, జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. 

Updated Date - 2022-05-21T07:14:03+05:30 IST