Jul 23 2021 @ 23:55PM

వేటాడే కత్తితో... వాదించే వృత్తిలో!

తమిళ కథానాయకుడు సూర్య చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉన్నాయి. ఒకటి... ‘జై భీమ్‌’. ఇంకొకటి... ‘ఎతారుక్కుమ్‌ తున్నిందవన్‌’. మరొకటి... ‘వాడివాసల్‌’. రెండు సినిమాల్లో ఆయన పోషించే పాత్రలు ఏమిటన్నది వెల్లడించారు. శుక్రవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘ఎతారుక్కుమ్‌ తున్నిందవన్‌’ మోషన్‌ పోస్టర్‌, సినిమాలో హీరో లుక్స్‌ మూడు విడుదల చేశారు. వాటిని చూస్తే... కత్తి చేతబట్టి ప్రత్యర్థులను వేటాడి, వెంటాడి చంపే వ్యక్తిగా ఆయన నటిస్తున్నారని అర్థమవుతోంది. పాండిరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న చిత్రమిది. దీనికి భిన్నమైన కథాంశంతో ‘జై భీమ్‌’ రూపొందుతోంది.


ఇందులో బడుగు-బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా... కులవృత్తులే జీవనోపాధిగా బతుకు వెళ్లదీస్తున్న ప్రజల పక్షాన పోరాడే న్యాయవాది పాత్రలో సూర్య కనిపించ నున్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌ చిత్రకథాంశానికి అద్దం పట్టేలా ఉంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానవేల్‌ దర్శకుడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన ఉందని సమాచారం.