పండుగల కంటే ప్రాణాలు ముఖ్యం

ABN , First Publish Date - 2020-10-19T08:42:38+05:30 IST

‘‘పండుగలు ఏటా వస్తాయిగానీ.. ప్రాణాలు పోతే తిరిగి రావు. కాబట్టి దసరా, దీపావళి పండుగలు జరుపుకొనే సమయంలో వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి’’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల

పండుగల కంటే ప్రాణాలు ముఖ్యం

ఈ ఒక్కసారికి ఇంట్లోనే జరుపుకోండి

కేరళలో ఓనం తర్వాత కేసులు పెరిగాయి

వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు

ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు


హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘పండుగలు ఏటా వస్తాయిగానీ.. ప్రాణాలు పోతే తిరిగి రావు. కాబట్టి దసరా, దీపావళి పండుగలు జరుపుకొనే సమయంలో వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి’’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే.. కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందో తెలియదు, వచ్చినా దాని పనితీరు ఎలా ఉంటుందో తెలి యదన్నారు. వ్యాక్సిన్‌ వచ్చేదాకా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం మార్గదర్శకాల మే రకు రాష్ట్రంలో వ్యాక్సిన్స్‌ ఎవరికి అందించాలన్న దానిపై లైన్‌లిస్టు తయారుచేస్తున్నామన్నారు.  వైద్య విద్య సంచాలకు డు రమేశ్‌రెడ్డితో కలిసి.. కోఠిలోని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పండుగల ను జరుపుకోవద్దని తాము సూచించట్లేదని.. ఈ ఒక్కసారికి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.  బతుకమ్మ ఆడే సమయంలో మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కేరళలో నెల రోజుల పాటు జరిగిన ఓనం పండుగ వల్ల కరోనా కేసులు భారీగా పెరిగాయని..


ప్రస్తుతం అక్కడ రోజూ 10 వేల కేసులు నమోదు అవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అక్కడ ఇన్నాళ్లుగా కొవిడ్‌ను బాగా నియంత్రించినప్పటికీ.. పండుగ మూలంగా కేసులు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీతో పాటు యూరప్‌ దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతు న్నాయన్నారు. అక్కడ ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్లే వైరస్‌ వ్యాప్తి పెరిగిందని చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే పండుగల తర్వాత, మన దగ్గర కూడా కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పండుగల నేపథ్యంలో దీనిపై ప్రత్యేక ప్రచారం చేపట్టినట్లు వెల్లడించారు. చలికాలంలో వైర్‌సలు విజృంభిస్తాయని, పిల్లలు, వృద్ధుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.   


 16 వేల మందికి చికిత్స..

భారీ వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలే ముప్పు ఉన్న నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని శ్రీనివాసరావు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 182 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ 16 వేల మందికి చికిత్స అందించామని చెప్పారు. ఆ శిబిరాల్లో కరోనా పరీక్షలు కూడా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 2 వేల మందికి టెస్ట్‌ చేేస్త 16 మంది కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అందరినీ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వేడి ఆహారపదార్ధాలనే భుజించాలని విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు వైద్య సేవల కోసం 104కు ఫోన్‌ చేయాలని కోరారు. కాగా.. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని, ఇంకొంత కాలం జాగ్రత్తగా ఉండాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లోనే కరోనా తీవ్రత ఉందని, అక్కడ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో గతంలో 900 మంది కరోనా రోగులుంటే ఇప్పుడు 350 మందే ఉన్నట్లు ఆయన తెలిపారు.


వైద్య, ఆరోగ్య శాఖ ప్రచారం

పండుగలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రచారం చేపట్టనుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు కోరారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కరోనా నుంచి దాదాపు 2 లక్షల మంది పూర్తిగా కోలుకున్నారు. తాజాగా మరో 1436 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకూ కరోనా సోకిన వారి సంఖ్య 2,22,111కు చేరింది.       

Updated Date - 2020-10-19T08:42:38+05:30 IST