బలహీన రూపాయితో బతుకు బండలు!

ABN , First Publish Date - 2022-07-28T10:21:02+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి చేరింది...

బలహీన రూపాయితో బతుకు బండలు!

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం డాలరుతో పోలిస్తే రూపాయి విలువ దాదాపు రూ.80 దాకా దిగజారింది. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 7శాతానికి పైగా తగ్గింది. ఇది మరింత క్షీణిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చమురు ధరల జోరు, అమెరికా వడ్డీ రేట్లను పెంచడం, వాణిజ్య లోటు పెరగడం వంటి పరిణామాలు ఇటీవల మన రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. 


ఆర్థిక వ్యవస్థలో ఇంధన వనరులది కీలకపాత్ర. భారత్‌ తన ముడి చమురు అవసరాల్లో 85శాతం వరకు దిగుమతుల పైనే ఆధారపడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ముడి చమురు వాటా సుమారు 28శాతం. రష్యా యుద్ధం విష యంలో అనిశ్చితి కొనసాగినన్నాళ్లూ చమురు ధరలూ దిగివచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో చమురు ధరలు దిగిరాకపోతే భారత్‌ భారీగా వాణిజ్యలోటును ఎదుర్కొం టుంది. కొన్నాళ్ల క్రితం 20 డాలర్లకే లభించిన ముడిచమురు పీపా ఇప్పుడు 98–101 డాలర్ల వద్ద కొనసాగుతోంది. రూపాయి విలువ క్షీణతపై ముడి చమురు ధర చాలా ప్రభావం చూపుతోంది. మన దేశానికి ఇరాన్‌తో చాలా మంచి సంబంధాలు ఉండటంవల్ల గతంలో చమురు దిగుమతులను ఎక్కువగా ఆ దేశం నుంచి చేసుకున్నాం. ఇప్పుడు అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి దిగుమతులు తగ్గించుకున్నాం. చమురుకు దిగుమతులపై ఆధారపడిన మన దేశానికి ఇది శరాఘాతం. అందువల్ల చమురు ధరలు పెరిగిన ప్రతిసారి రూపాయి విలువ క్షీణిస్తోంది.  


మన దిగుమతుల్లో మూడోస్థానం బంగారానిది. అంతర్జాతీయ విపణిలో తాజాగా ఔన్సు బంగారం ధర 1,707 డాలర్ల స్థాయిలో ఉండగా, రాబోయే రోజుల్లో ఇది 2,000 డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. అదే జరిగితే దిగుమతుల బిల్లు మరింత పెరిగి, తద్వారా వాణిజ్య లోటు ఇంకా ఎగబాకుతుంది.


ఎగుమతుల కన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే వాణిజ్యలోటు ఏర్పడుతుంది. వాణిజ్యలోటు పెరిగినంత కాలం రూపాయి పతనమవుతూనే ఉంటుంది. అంతకుముందు ఏడాది 29,100కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఎగుమతులు 2021– 22లో 41,700 కోట్ల డాలర్లకు చేరాయి. అదే కాలంలో దిగుమతులు 39,400కోట్ల డాలర్ల నుంచి 61,000కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫలితంగా 19,241కోట్ల డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడి రూపాయి పతనానికి దారితీసింది. గత అయిదు నెలలుగా రూపాయి క్షీణత శాతం క్రమంగా పెరుగుతున్నది. ప్రపంచ వృద్ధిరేటు మందగిస్తున్న నేపథ్యంలో 2022–23లో ఎగుమతుల్లో జోరు నెలకొంటుందా అనేది సందేహాస్పదమే. 


మన దేశం నుంచి వేరే దేశాల్లోకి తరలివెళ్లే సొమ్ముకు అంతే మొత్తంలో పెట్టుబడులు రాకపోవడం కూడా ఒక పెద్ద కారణం. ఇతర దేశాల నుంచి మనం చేసుకునే దిగుమతులకు తగినట్టుగా ఎగుమతులు చేయకపోతే వాణిజ్యలోటు పెరిగిపోతుంది. దేశంలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ అవడం వల్ల కరెంటు ఖాతా లోటు పెరిగిపోవడం మూలంగా రూపాయి మారకపు విలువ క్షీణిస్తోంది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం వల్ల చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితం అయ్యాయి. దీని మూలంగా మార్కెట్టులో విశ్వాసం సన్నగిల్లుతున్నది. పెట్టుబడులు అనేకం వెనక్కి వెళ్లిపోవడంవల్ల రూపాయి విలువ క్షీణిస్తున్నది.


డాలరుతో పోల్చినప్పుడు మన దేశంతోపాటు ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీన పడ్డాయని మన ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, సామాజిక భద్రత కనిష్ఠంగా ఉన్న మన దేశంలో రూపాయి మారకపు విలువ తగ్గడం వల్ల సమాజంలో దాదాపు అన్ని వర్గాల మీద దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన అవసరాల్లో దాదాపు సగం దిగుమతుల వల్లే తీరుతున్నాయి. కాబట్టి ఆ మేరకు పన్నులన్నీ కలపడం వల్ల సామాన్య ప్రజానీకంపై తీవ్ర భారం పడుతుంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దానికి సంబంధించిన అన్ని రకాల సేవలపై భారం పడుతుంది. ప్రయాణ చార్జీలు, కూరగాయల  ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ప్రజల జీవన వ్యయం పెరగడం వల్ల ఆదాయపు విలువ తగ్గి ప్రజలకు తీవ్ర భారంగా మారుతుంది. ఎలక్ట్రానిక్స్ కూడా ఖరీదైనవిగా మారుతాయి. ఎలక్ట్రానిక్స్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బంగారం దిగుమతులు పెరగడం, కరెంటు ఖాతా లోటుకు దారితీస్తుంది. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, సోలార్ ప్లేట్‌లు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు వివిధ రకాల డివైజ్‌లకు చెందిన విడి భాగాలను మనం దిగుమతి చేసుకుంటున్నందువల్ల, వీటికి చెల్లించాల్సిన ఖర్చు మరింత పెరుగుతుంది.


రూపాయి విలువ పతనం అవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులు ఆధిగమించడానికి ఆర్‌బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీంతో మన దేశం దగ్గర ఉన్న నిల్వలు పడిపోయాయి. అది కూడా మంచి పరిణామం కాదు. మన ఎగుమతులను, ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకోవాల్సిన  అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. దీంతో ఉత్పత్తి పెరిగి ఎగుమతులు చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి రూపాయి స్థిరీకరణ చేయవచ్చు. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ సంస్థలను నెలకొల్పడం, ఉన్నవాటి సామర్థ్యాన్ని, ఉత్పత్తిని పెంచి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం చేయాలి. దిగుమతుల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ఇంధన అవసరాల కోసం దేశీయ సంస్థల్ని పురికొల్పి, ఎక్కువ ఉత్పత్తిని సాధించేలా చేయాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పాదకతను పెంచుకోవడం ద్వారా స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది. దేశీయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులకు అవకాశం కల్పించాలి. ఆర్‌బీఐ, ప్రభుత్వం సమన్వయంతో మార్కెట్టులో జోక్యం చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి.


రూపాయి విలువ పతనం వలన మొత్తం భారం సామాన్య వినియోగదారులపై పడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో సరైన అవగాహన, పరస్పర సహకారంతో ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

పి. సతీష్ 

ఎల్.ఐ.సి ఉద్యోగుల సంఘం నాయకులు

Updated Date - 2022-07-28T10:21:02+05:30 IST