పొరపొచ్చాలున్నా... దౌర్భాగ్యం కొద్దీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి : సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2020-05-31T19:22:41+05:30 IST

అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంతోనే గుజరాత్‌లో కరోనా వ్యాప్తి జరిగిందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.

పొరపొచ్చాలున్నా... దౌర్భాగ్యం కొద్దీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి : సంజయ్ రౌత్

ముంబై : అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంతోనే గుజరాత్‌లో కరోనా వ్యాప్తి జరిగిందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. గుజరాత్ నుంచే ముంబై, ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు కరోనా పాకిందని ఆయన మండిపడ్డారు. ముందస్తు వ్యూహం లేకుండా దేశంలో లాక్‌డౌన్ విధించారని, ఇప్పుడు మాత్రం నిబంధనల సడలింపు విషయంలో రాష్ట్రాలకే వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మహావికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రతిపక్ష బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోందని, అయితే దౌర్భాగ్యం కొద్దీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సంకీర్ణంలో పొరపొచ్చాలున్నప్పటికీ... బలవంతంగానైనా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సంకీర్ణ పక్షాలపై ఉందన్నారు. 


‘‘గుజరాత్‌లో జరిగిన ట్రంప్ కార్యక్రమం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందన్న విషయాన్ని తోసిపుచ్చలేం. ఎందుకంటే భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.’’ అని ఆయన ఆరోపించారు. తాము కరోనాను అరికట్టడంలో విఫలమయ్యామని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని, ఇదే ప్రాతిపదికన మరో 17 రాష్ట్రాల్లో కూడా రాష్ట్రపతి పాలన విధించాలని, అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. సాక్షాత్తు కేంద్రమే కరోనాను అరికట్టడంలో విఫలమైందని రౌత్ ఆరోపించారు. 


Updated Date - 2020-05-31T19:22:41+05:30 IST