పాఠశాలల వనరులపై సర్వే

ABN , First Publish Date - 2020-06-05T10:01:13+05:30 IST

కొవిడ్‌ -19 నేపథ్యంలో పాఠశాలల్లో వనరులు, పరిశుభ్రత, ఆరోగ్య పరిస్థితులను మదింపు చేయడానికి విద్యా

పాఠశాలల వనరులపై సర్వే

ప్రత్యేక యాప్‌ ద్వారా స్వచ్ఛత, భద్రత సమాచార సేకరణ


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కొవిడ్‌ -19 నేపథ్యంలో పాఠశాలల్లో వనరులు, పరిశుభ్రత, ఆరోగ్య పరిస్థితులను మదింపు చేయడానికి విద్యా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలు చేపడుతూనే విద్యా సంవత్సరం ప్రారంభించే విషయమై కసరత్తు చేస్తోంది. యునిసెఫ్‌, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం సమర్థవంతంగా అమలయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రత్యేక యాప్‌ ద్వారా పాఠశాలల్లో వనరులు, పరిశుభ్రత ఆధారంగా స్టార్‌ రేటింగ్‌ కేటాయించనున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల సమాచారాన్ని ఈనెల 10లోగా అప్‌లోడ్‌ చేసేలా విద్యా శాఖ అధికారులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు వచ్చాయి. అప్‌లోడ్‌ చేసిన సర్వే సమాచారంలో గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై గడువులోగా నివేదిక అందజేయాల్సి ఉంటుంది. 


యాప్‌లో పాఠశాలల్లో తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల స్థితిగతులు, శుభ్రతకు చేసిన ఏర్పాట్లు, వ్యక్తిగత దూరం, మాస్కుల వినియోగం, నిర్వహణ తీరు, విద్యార్థుల్లో ప్రవర్తన, ఆలోచనా ధోరణి, సామర్థ్యాల పెంపు తదితర అంశాల వివరాలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈనెల 10వ తేదీలోగా అప్‌లోడ్‌ చేసేలా గడువు నిర్దేశించారు. జిల్లాలో గురువారం వరకు 29 శాతం మేర పాఠశాలల సమాచారం అప్‌లోడ్‌ చేశారు. ఆరు రోజుల్లో 71 శాతం పొందుపరచాల్సి ఉంది. 

Updated Date - 2020-06-05T10:01:13+05:30 IST