సర్వే సరే.. మందులేవీ?

ABN , First Publish Date - 2021-05-09T06:06:13+05:30 IST

ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కాగితాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక బృందాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాయి.

సర్వే సరే.. మందులేవీ?
హుజూర్‌నగర్‌ మండలంలో ఇంటింటి సర్వే చేస్తున్న వైద్యసిబ్బంది

వైరస్‌ లక్షణాలున్నా పట్టించుకోని అధికారులు


హుజూర్‌నగర్‌,  మే 8: ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కాగితాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక బృందాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాయి. ఒక్కో బృందంలో సూపర్‌వైజర్‌, ఎఎన్‌ఎం, ఆశా వర్కర్‌, ఆర్పీ ఉంటారు. సూర్యాపేట జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 681 బృందాల్లో, 2,724 మంది సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. మూడురోజుల్లో సుమారు లక్ష మందిని సర్వే చేయగా, వైరస్‌ లక్షణాలు ఉన్న 4వేల మంది వరకు గుర్తించారు. కాగా, అధికారుల లెక్కల ప్రకారం 2099 మందికి మాత్రమే మందులు ఇచ్చారు. కొన్ని చోట్ల సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది పేర్లు రాసుకుని వెళ్లడం తప్ప మందులు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. హుజూర్‌నగర్‌ మండలంలో అధికారుల లెక్కల ప్రకారం 120 మందిని లక్షణాలున్నట్టుగా గుర్తించగా, 42 మందికే మందులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, జిల్లాలో సర్వే చేస్తున్న వైద్య సిబ్బందికి కనీసం మాస్క్‌లు, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదు. ఇక పీహెచ్‌సీల్లో సైతం నామమాత్రంగానే కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రిలో నాలుగురోజులుగా అసలు పరీక్షలే నిర్వహించడంలేదు. ఇటు పరీక్షలు నిర్వహించక, అటు లక్షణాలున్నా మందులు ఇవ్వకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. 


లక్షణాలున్నవారికి మందులు:కోటాచలం, సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌వో

కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారందరికీ మందులు పంపిణీ చేస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో మందులు ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం చెప్పిన విధంగా కిట్ల రూపంలో అందజేయాలని ఆదేశించాం. జిల్లా ఇప్పటి వరకు 2100 మందికి మందులు అందజేశాం. అందరికి మందులు ఇచ్చి కరోనాను కట్టడి చేస్తాం.

Updated Date - 2021-05-09T06:06:13+05:30 IST