సర్వేతో.. సరి!

ABN , First Publish Date - 2022-07-17T05:46:00+05:30 IST

వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన ఉంది. పథకానికి వైఎస్సార్‌ పేరు పెట్టుకోవడంలో చూపిన శ్రద్ధ నిర్మాణంపై చూపడంలేదు.

సర్వేతో.. సరి!
గోదావరి జలాలు నాగార్జున సాగర్‌ కుడి కాలువలో కలిసే ప్రదేశం ఇదే

వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకం తీరిది

భూసేకరణకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం

రెండేళ్లుగా అడుగు ముందుకు పడలేదు.. 

ఈ పథకం సాగర్‌ ఆయకట్టు వరప్రదాయని

10 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా

ప్రభుత్వ తీరుతో అన్నదాతల తీవ్ర అసంతృప్తి


వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకాన్ని 2020లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.6,020 కోట్లు నిధులు కేటాయించినట్టు తెలిపింది. దీనికోసం 3,437 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన సర్వే కూడా పూర్తయింది. పథకం నిర్మాణానికి భూసేకరణకు రూ.955 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. భూసేకరణకు సంబంధించిన ప్రకటనను కూడా రెవెన్యూ శాఖ జారీ చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇందుకు నిఽధులు విడుదల కాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. గోదావరి జలాల తరలింపుతో నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టులో నెలకొనే సాగునీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇది ఎప్పుడు మొదలవుతుందా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. 

 

నరసరావుపేట, జూలై16: వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన ఉంది. పథకానికి వైఎస్సార్‌ పేరు పెట్టుకోవడంలో చూపిన శ్రద్ధ నిర్మాణంపై చూపడంలేదు. గోదావరి పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా తొలిదశలో గోదావరి జలాలను సాగర్‌ ఆయకట్టు తరలించేందుకు గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. రెండేళ్లుగా ఈ పథకం నిర్మాణం అడుగు ముందుకు పడలేదు. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.6,020 కోట్లు నిధులు కేటాయించినట్టు 2020లో ప్రభుత్వం ప్రకటించింది. రెండు ప్యాకెజీల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లకు కూడా పనులు అప్పగించినట్టు తెలిపింది.  ఈ పథకం నిర్మాణానికి భూసేకరణ ఎక్కడవేసిన అక్కడనే అన్న చందాన మారింది. దీంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. సాగర్‌ కుడికాలువ ఆయకట్టుకు వరప్రదాయనిగా నిలిచే పథకంపై ప్రభుత్వం శీతకన్ను వేయడంపై అన్నదాతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.  


పంపుహౌస్‌ ప్రారంభించి నిలిపివేశారు..

 గోదావరి జలాల తరలింపుతో నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టులో నెలకొనే సాగునీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గోదావరి పెన్నా నదుల అనుసంధానం పఽథకం తొలిదశలో గోదావరి జలాలను కుడికాలువకు తరలించేందుకు పఽథకం రూపొందించారు. ఈ పథకానికి వైఎస్సార్‌ కరువు నివారణ పథకంగా పేరు మార్చి నిర్మాణానికి ప్రభుత్వం 2020లో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ పనులకు నిధుల విడుదలను విస్మరించింది. భూసేకరణ నిలిచిపోవడంతో పంపుహౌస్‌ నిర్మాణాన్ని ప్రారంభించి నిలిపివేశారు. రెండేళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోతుండటంతో గోదావరి జలాలు సాగర్‌ కుడికాలువకు తరలింపుపై అపోహలు నెలకొన్నాయి. గత ప్రభుత్వం గోదావరి జలాల తరలింపు పథకానికి నిధులు మంజూరు చేసి టెండర్లు నిర్వహించడం, ఈ పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. గత ఏడేళ్లలో మూడేళ్లు గుంటూరు, ప్రకాశం జిల్లాలు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కుడికాలువకు గోదావరి జలాలు  అందుతాయన్న భరోసా రెండు జిల్లాల్లో సన్నగిల్లుతోంది. గోదావరి జలాల తరలింపు పథకంతో ఇరు జిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు సరఫరా అవుతాయి. 


పూర్తయితే ఆయకట్లుకు మహర్దశ

పట్టిసీమ పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు సరఫరా చేస్తుండటంతో ఆ ప్రాంతంలో రెండు పంటలు సాగు చేసుకొనే అవకాశం ఏర్పడింది. ఇదే తరహాలో సాగర్‌ కుడికాలువ ఆయకట్టుకు కూడా మహర్దశ పట్టేది. కుడికాలువకు గోదావరి, పెన్నా అనుసంధానం పథకం పూర్తి జీవం పోస్తుంది. అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణానది నుంచి నీటిని అక్కడి నుంచి 66.59 కి.మీ. పొడువునా పైపులైన్‌ నిర్మించి సాగర్‌ కాలువ 80వ మైలు వద్దకు గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు పథకాన్ని రూపొందించారు. 56.50 కి.మీ. గురుత్వాకర్షణ ద్వారా నీటిని తరలిస్తారు. 10.09 కి.మీ. ఎత్తిపోతల ద్వారా నీటిని కుడి కాలువకు తరలిస్తారు. మొత్తం 20 పంపుల ద్వారా 148.68 మీటర్ల ఎత్తుకు 10.09 కి.మీ. మేర నీటిని ఎత్తి పోయాల్సి ఉంటుంది. ఆయకట్టుకు 73 టీఎంసీల నీటిని సరఫరా చేసే సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని గతంలో రూపొందించారు. ఈ పథకం పూర్తయితే ఆయకట్టులో సాగు చిత్రం పూర్తిగా మారుతుంది. సాగర్‌ కుడికాలువ వరకు గోదావరి జలాలు తరలింపు పథకానికి గత  ప్రభుత్వం రూ.6,020 కోట్ల వ్యయంతో ఈ ఎత్తిపోతల పథకానికి అంచనాలు రూపొందించి పనులకు టెండర్లు నిర్వహించిన విషయం విదితమే. గోదావరి జిలాలు కుడికాలువలో కలుస్తాయి. ఈ ఎత్తిపోతల పథకం పూర్తి చేయటం ద్వారా ఏడు వేల క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు తరలిస్తారు.  


పూర్తయిన సర్వే

ఈ పనుల కోసం 3,437  ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన సర్వే కూడా పూర్తయింది. అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, రాజుపాలెం  మీదుగా నకరికల్లు మండలంలోని సాగర్‌ కుడి ప్రధాన కాలువలో నీటిని కలుపుతారు. పథకం నిర్మాణానికి భూసేకరణకు రూ.955 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. భూసేకరణకు సంబంధించిన ప్రకటనను కూడా రెవెన్యూ శాఖ జారీ చేసింది. ఇందుకు నిఽధులు విడుదల కాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎత్తిపోతల పథకం పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. రూ.2281 కోట్లతో ఒక ప్యాకేజీ, రూ.2,655 కోట్లతో రెండో ప్యాకేజీగా నిర్ణయించి ఇద్దరు కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు.  అసలీ ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో అన్న సందేహాలు ఆయకట్టు రైతుల్లో నెలకొన్నాయి. 





Updated Date - 2022-07-17T05:46:00+05:30 IST