నత్తనడకన సర్వే

ABN , First Publish Date - 2020-08-10T10:10:12+05:30 IST

భువన్‌ యాప్‌ ఫేస్‌-2కు ఆదిలోనే అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నులను సవరించి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భువన్‌

నత్తనడకన సర్వే

భువన్‌ యాప్‌లో సాంకేతిక  లోపం

జియో ట్యాగింగ్‌లో ఏర్పడుతున్న ఇబ్బందులు

నేటితో ముగియనున్న నమోదు ప్రక్రియ

సిబ్బంది కొరతతో ముందుకు సాగని సర్వే


మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 9: భువన్‌ యాప్‌ ఫేస్‌-2కు ఆదిలోనే అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నులను సవరించి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భువన్‌ యాప్‌కు జియోట్యాగింగ్‌ చేసే ప్రక్రియ సాంకేతిక లోపం కారణంగా నత్తనడక నడుస్తోంది. సోమవారం లోపు అన్ని మున్సిపాలిటీల్లో సేకరించిన నూతన సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా, గడువు ముగుస్తున్నా లక్ష్యం ధరిచేరని పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆస్తుల లెక్కలు పక్కాగా నిర్వహించి, తద్వారా మున్సిపాలిటీల ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో భువన్‌ యాప్‌-2కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భువన్‌ యాప్‌-2 కు సంబంధించి సీడీఎంఏ గత నెల 14న విదివిధానాలతో కూడిన సర్క్యులర్‌ జారీ చేసింది. 


వివరాల సేకరణ ఇలా...

భువన్‌ యాప్‌-2లో భాగంగా మున్సిపల్‌ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉంటుంది. ఇంటికి సంబంధించిన కొలతలు, రెండు ఫొటోలతోపాటు మొత్తం చదరపు మీటర్లు, ఇంటి రకం, అంతస్తుల వివరాలు, ఇల్లు దేనికి ఉపయోగిస్తున్నారో తదితర పూర్తి వివరాలను సేకరించి జియోట్యాగింగ్‌ చేయడం ద్వారా భువన్‌ యాప్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ వల్ల ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, మున్సిపల్‌ నిబంధనల ప్రకారం ప్రతి ఇంటికి సరియైున విధంగా ఆస్తి పన్ను కేటాయించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. దీంతో పన్నులు సరిగ్గా వసూలు కావడంతోపాటు మున్సిపల్‌ ఆదాయం కూడా పెరుగనుంది. ప్రస్తుతం భువన్‌ యాప్‌లో ప్రతి ఇంటి వివరాలను నమోదు చేస్తుండగా, ఇంటి నంబర్‌ సహాయంతో పూర్తి వివరాలు అధికారులకు అందుబాటులో ఉండనున్నాయి. 


అక్రమాలకు చెక్‌...

జియో ట్యాగింగ్‌ వల్ల ఆస్తిపన్నుల అమలులో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం భువన్‌ యాప్‌కు శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో ఇంటి అనుమతి మొదలుకొని ఇంటి నంబర్లు, ఆస్తి పన్నుల కేటాయింపు, నిర్మాణ అనుమతుల అనంతరం నిబంధనలకు విరుద్దంగా ఎక్కువ సంఖ్యలో అంతస్తులు నిర్మించడం, కొలతల సమయంలో సిబ్బందిని మచ్చిక చేసుకొని లెక్కలు తక్కువ చూపడం, తద్వారా ఆస్తిపన్నును తక్కువగా చెల్లించడం లాంటి అక్రమాలకు చెక్‌ పడనుంది. అలాగే నివాస గృహంగా అనుమతులు తీసుకొని వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం లాంటి చర్యలకు అడ్డుకట్ట పడనుంది. భువన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేయడం వల్ల అసలు ఆస్తిపన్ను ఎంత ఉండాలన్నది నిర్ధారణ కానుండగా రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుసంధానం చేయడం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు సైతం అడ్డుకట్ట పడనుంది. వీటితో పాటు భవనాలపై ప్రచారం కోసం ఏర్పాటు చేసే కటౌట్లు, సెల్‌ టవర్లు, తదితర వినియోగాలకు అనుమతులు, పన్నులు విధించడంలో తగిన నిర్ణయం తీసుకొనేందుకు అవకాశం ఏర్పడనుంది. 


20 శాతమే పూర్తి..

భువన్‌ యాప్‌లో పూర్తి వివరాలు నమోదు చేసేందుకు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా సిబ్బంది కొరతతో ప్రక్రియ నత్త నడకన కొనసాగుతోంది. ఒక్కో ఇంటి సర్వే నిర్వహించినందుకు గాను విద్యార్థులకు రూ. 20 చొప్పున చెల్లిస్తుండగా, ఒక్కొక్క ఇంటి పూర్తి సమాచారం సేకరించేందుకు అరగంట సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగా చెల్లించే మొత్తం సరిపోక విద్యార్థులు మద్యలోనే పని మానివేసి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. సీడీఎంఏ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి సర్వే ప్రారంభించి 10వ తేదీకల్లా పూర్తి చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే సర్వే పూర్తయినట్లు సమాచారం. మంచిర్యాలలో 21,034 గృహాలకుగాను కేవలం 974 ఇళ్లకు సంబంధించి మాత్రమే సర్వే పూర్తయింది.


సాంకేతిక లోపంతో ఆలస్యం..మంచిర్యాల కమిషనర్‌ స్వరూపారాణి

జియో ట్యాగింగ్‌లో ఏర్పడుతున్న సాంకేతిక లోపం కారణంగా భువన్‌ యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతోంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 7 జోన్లలో రోజుకు సరాసరి 150 ఇళ్లకు సంబంధించి సర్వే జరుపుతున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తాం. 


జిల్లాలోని భవనాల వివరాలు...

జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో నివాస, వాణిజ్య గృహాల వివరాలు....వాటికి ప్రస్తుతం విధిస్తున్న ఆస్తి పన్నుల డిమాండ్‌ ఇలా ఉంది. 


మున్సిపాలిటీ గృహాల సంఖ్య ఆస్తిపన్ను డిమాండ్‌ (రూపాయల్లో)

మంచిర్యాల       21,034 8. 46 కోట్లు

క్యాతన్‌పల్లి 10,412 82. 04 లక్షలు

మందమర్రి 12,962 1. 18 కోట్లు

బెల్లంపల్లి 10,514 1. 86 కోట్లు

లక్షెట్టిపేట్‌ 5,891 83. 81 లక్షలు

నస్పూర్‌ 21,748 1. 13 కోట్లు

చెన్నూర్‌ 6,564 1. 18 కోట్లు

Updated Date - 2020-08-10T10:10:12+05:30 IST