పోలీసుల డేగకన్ను

ABN , First Publish Date - 2020-09-27T12:47:01+05:30 IST

మావోయిస్టుల కోసం పోలీసులు డేగకన్ను వేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని కదంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోల కీలక నేత ...

పోలీసుల డేగకన్ను

మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు

డ్రోన్‌ కెమెరాలతో నిఘా

ప్రాణహిత తీరం వెంట ప్రత్యేక బలగాల గస్తీ

ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్రమత్తమైన ఖాకీలు

జిల్లా కేంద్రంలోనూ రహస్య విచారణ

మంచిర్యాల, సెప్టెంబరు 26: మావోయిస్టుల కోసం పోలీసులు డేగకన్ను వేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని కదంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోల కీలక నేత భాస్కర్‌ అలియాస్‌ అడేళ్లు తప్పించుకున్నాడని భావిస్తున్న పోలీసులు అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రాణహిత తీరం వెంట తలదాచుకొనే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో ప్రత్యేక బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. డ్రోన్‌ కెమెరాల సహాయంతో అనువణువునా గాలిస్తున్నాయి.   రెండు రోజుల క్రితం మంచిర్యాల ఇన్‌చార్జి ఏసీపీ నరేందర్‌ ప్రాణహిత తీరాన్ని డ్రోన్‌ కెమెరాతో పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇతర జిల్లాల అధికారులు సైతం ప్రాణహిత పరీవాహక ప్రాంతంలో కూంబింగ్‌ ముమ్మరం చేశారు. చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్‌లకు చెందిన పోలీసులు సైతం నిఘా పెంచారు.  

 జిల్లా కేంద్రంలో తలదాచుకున్నాడని..

మావోయిస్టు కీలక నేత భాస్కర్‌ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తలదాచుకోవడానికి వస్తున్నాడనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రహస్యంగా అతని రాకపై విచారణ జరిపారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ ఆదేశాలతో పోలీసులు మూడు రోజులపాటు పలువురు వ్యక్తులపై నిఘా ఉంచి, వారి కదలికలను గమనించారు. భాస్కర్‌తో పరిచయాలు ఉన్నాయన్న కోణంలో సదరు వ్యక్తుల ఇళ్లల్లోనూ నిఘా పెట్టారు. వారి ఇళ్లకు ఎవరెవరు వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే కోణంలో రహస్యంగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ఇద్దరు వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం. భాస్కర్‌ వస్తున్నాడన్న సమాచారం అందుకున్న సదరు వ్యక్తులు అతనికి ఆశ్రయం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే భాస్కర్‌ కదలికలపై తాము ఽధృష్టిసారించినట్లు పసిగట్టిన అతను చివరి నిమిషంలో తన ప్రణాళికను మార్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

భయాందోళనలో ప్రజలు..

జిల్లా కేంధ్రంలో భాస్కర్‌ కోసం పోలీసులు రహస్య విచారణ జరిపారన్న విషయం తెలియగానే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. భాస్కర్‌తో ఎవరికి పరిచయాలు ఉన్నాయి అనే విషయంలో స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భాస్కర్‌ కోసం పట్టణంలోని పోలీసులు విచారణ జరపుతున్నారన్న సమాచారంతో ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ప్రజల్లో తీవ్ర అలజడి ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఇక్కడ పెద్దగా చెప్పుకోదగ్గ సంఘటనలేవీ జరుగక పోవడం, ఏకంగా భాస్కర్‌ కోసం పోలీసులు నిఘా పెట్టారనే ప్రచారంతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు.

గాలింపు ముమ్మరం..

మావోయిస్టు అగ్రనేత భాస్కర్‌ కోసం గాలింపు ముమ్మరమైంది. ప్రాణహిత సరిహద్దుల్లో శనివారం కూడా ప్రత్యేక బలగాలు పెద్ద ఎత్తున డ్రోన్‌ కెమెరాల సహాయంతో గాలింపు చేపట్టారు. తెలంగాణ, మహారాష్ట్ర అటవీ ప్రాంతంతోపాటు, సరిహద్దులోని ప్రాణహిత పరీవాహక ప్రాంత గ్రామాల్లో నిఘా విభాగం ఎస్సై సాగర్‌ నేతృత్వంలో పోలీసులు జల్లెడ పట్టారు. కొత్తవాళ్లు వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 

Updated Date - 2020-09-27T12:47:01+05:30 IST