‘మత్తు’పై నిఘా

ABN , First Publish Date - 2021-10-26T05:59:19+05:30 IST

మత్తు వదిలించడానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం నిఘా పెంచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గంజాయి, గుట్కా నియంత్రణ కోసం విస్తృత తనిఖీలు చేపడుతోంది. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గంజాయి, గుట్కా విక్రయాల అడ్డుకట్ట వేస్తున్నారు.

‘మత్తు’పై నిఘా

 - గంజాయి, గుట్కా నిల్వలపై ఉక్కుపాదం 

-  ఇప్పటి వరకు 15 కేసులు

- 17కిలోల గంజాయి పట్టివేత

- రూ.8.65 లక్షల విలువైన గుట్కా..

- 80 మంది అరెస్టు 

- జిల్లా సరిహద్దులో వాహనాల తనిఖీలు

- పాన్‌షాపులు, గల్లీ కిరాణా దుకాణాల్లో సోదాలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మత్తు వదిలించడానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం నిఘా పెంచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గంజాయి, గుట్కా నియంత్రణ కోసం విస్తృత తనిఖీలు చేపడుతోంది. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గంజాయి, గుట్కా విక్రయాల అడ్డుకట్ట వేస్తున్నారు.   మత్తుపదార్థాల నిల్వలు పట్టుకోవడంతో సంబంధిత వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు.  రెండు రోజుల క్రితం జిల్లాలోని వట్టెంల గ్రామంలో గంజాయికి అలవాటు పడిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన తన స్నేహితుడి వద్ద నుంచి కొనుగోలు చేసి గంజాయి తాగేవారు. వీరి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువకులను అరెస్టు చేశారు.  జూన్‌లో ఎల్లారెడ్డిపేట మండలంలో పది కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్‌, పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి జిల్లాకు గంజాయి రవాణా జరుగుతుండడంతో  దానిని అడ్డుకుంటున్నారు.  కొద్దిరోజులుగా పోలీసులు నిఘాను పెంచిన క్రమంలోనే ప్రభుత్వం కూడా మత్తు పదార్థల విక్రయాలు,రవానాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో  జిల్లాలోని పాన్‌షాపులు, కిరాణ దుకాణాల్లో సోదాలు చేస్తున్నారు. సరిహద్దుల్లోనూ వాహనాలు తనిఖీలు  నిర్వహిస్తున్నారు. 

 జిల్లాలో 60 కేసులు నమోదు 

జిల్లాలో ఈ సంవత్సరంలో గుట్కా విక్రయానికి సంబంధించి 50 కేసులు నమోదయ్యాయి.  80 మందిని అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.8. 65 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గంజాయి విక్రయిస్తున్నవారితోపాటు తాగుతున్న  సంఘటనల్లో 15 కేసులు నమోదు చేశారు. 17 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గతంలో  ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేసేవారు. పోలీసుల నియంత్రణ చర్యలతో పూర్తిగా సాగు నిలిచిపోయింది. ఇప్పుడు పొరుగు జిల్లాల నుంచి రవాణా అవుతుండడంతో మరోసారి గంజాయిపై ఆందోళనలు  నెలకొన్నాయి.  దీంతో గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. 

గుట్టుగా గుట్కా దందా 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుట్కా దందా  గుట్టుగా సాగుతోంది. జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో గుట్కాపై నిషేధం లేకపోవడంతో భారీగా రవాణా అవుతోంది. కామారెడ్డి వరకు రైలు ద్వారా గుట్కాను తీసుకొచ్చి అక్కడి నుంచి  జిల్లా వ్యాప్తంగా రవాణా చేస్తున్నారు. పాన్‌షాపులు, చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో గుట్కాలకు సినిమా హీరోయిన్ల పేర్లను పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. రూ.5 విలువ ఉన్న గుట్కా ప్యాకెట్‌ను రూ.15 వరకు అమ్ముతున్నారు. జిల్లాలో తరచూ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, పోలీసులు గుట్కాను పట్టుకున్నా మళ్లీ యఽథావిధిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సంవత్సరంలో రూ.8.65 లక్షల విలువైన గుట్కాను పట్టుకోవడాన్ని బట్టి లక్షల్లోనే వ్యాపారం సాగుతున్నటు తెలుస్తోంది. ప్రస్తుత గంజాయితోపాటు గుట్కా నియంత్రణపై పోలీసులు సమరాన్ని సాగిస్తున్నారు. 


Updated Date - 2021-10-26T05:59:19+05:30 IST