ఏవోబీపై నిఘా

ABN , First Publish Date - 2021-07-30T05:02:15+05:30 IST

మావోయిస్ట్‌ అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి కొనసాగుతుండడంతో ఏవోబీలో దళాలు ముమ్మరంగా కూంబింగ్‌ చేపడుతున్నాయి. ఏటా జూలై 28 నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్ట్‌లు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏవోబీలో ఎన్‌కౌంటర్లు జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.

ఏవోబీపై నిఘా
ఏవోబీలో దళాల కూంబింగ్‌ (ఫైల్‌)

తూర్పు కనుమలను జల్లెడ పడుతున్న దళాలు

కొనసాగుతున్న మావోయిస్టు వారోత్సవాలు 

సాలూరు రూరల్‌, జూలై 29: మావోయిస్ట్‌ అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి కొనసాగుతుండడంతో ఏవోబీలో దళాలు ముమ్మరంగా కూంబింగ్‌ చేపడుతున్నాయి. ఏటా జూలై 28 నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్ట్‌లు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏవోబీలో ఎన్‌కౌంటర్లు జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఏడాది ఎన్‌కౌంటర్లల్లోఏవోబీలో పది మంది మావోయిస్టులు, ముగ్గురు సానుభూతిపరులు ప్రాణాలు కోల్పోయారు. ఏవోబీలో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతుండడంతో క్యాడర్‌లో ఆత్మసైర్థ్యం నింపడానికి మావోయిస్టులు వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఏవోబీలో మల్కనగిరి జిల్లా కొండహాజరి, గాజేడు, కల్‌గుడల్లో అమరులకు స్థూపాలు నిర్మించి నివాళులర్పించారు. విశాఖ జిల్లా జామిగుడ చింతలవీధిలో సైతం స్థూపం నిర్మించారు. ఈ నేపథ్యంలో ఇరురాష్ట్రాల సాయుధ దళాలు ఏవోబీ అడవులను జల్లెడ పడుతున్నాయి. వారోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం మావోలను కట్టడి చేసేందుకు సమాధాన్‌ను అమలు చేస్తోంది. ఇదే సమయంలో పట్టున్న ప్రతి  గ్రామంలో వారోత్సవాలను విజయవంతం చేయడానికి మావోయిస్టులు పట్టుదలతో ఉన్నారు. ప్రజాఉద్యమంలో అసువులు బాసిన మావోయిస్ట్‌ అమర వీరులకు గ్రామగ్రామాన నివాళులర్పించాలని భావిస్తున్నారు.మావోలకు ఇవి ప్రత్యేకమైన, ప్రతిష్టాతమైన వారోత్సవాలు కావడంతో ఏవోబీలో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రముఖ రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు ఏజెన్సీలో పర్యటించవద్దని పోలీసులు సమాచారమిచ్చారు. ప్రజాప్రతినిధులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ముందస్తు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. వారోత్సవాల సమయంలో ఏజెన్సీలో ఏమి జరుగుతుందోనని గిరిజనులు టెన్షన్‌తో ఉన్నారు. 

భద్రత చర్యలు తీసుకున్నాం

మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక దళాలతో ఏవోబీ అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నాం. పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నాం. వాహన తనిఖీలను నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఏజెన్సీలో పర్యటించవద్దని నోటీసులిచ్చాం.

- లెంక అప్పలనాయుడు, సీఐ, సాలూరు 



Updated Date - 2021-07-30T05:02:15+05:30 IST