Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 28 Jul 2021 07:30:04 IST

నిఘాను చట్టబద్ధం చేసింది కాంగ్రెస్సే

twitter-iconwatsapp-iconfb-icon
నిఘాను చట్టబద్ధం చేసింది కాంగ్రెస్సే

దేశవిదేశాల నుంచి నిత్యం వచ్చే లక్షలాది ఫోన్‌కాల్స్ ఇంటర్నెట్ సందేశాలలో అనేకం భారతీయ నిఘావర్గాలు పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు ప్రభుత్వవర్గాలను అప్రమత్తం చేస్తుండడం భద్రతాపరమైన ఒక ప్రక్రియ. పౌరుల ఫోన్ సంభాషణలు వినడానికి, డిజిటల్ సమాచారాన్ని వీక్షించడానికి చట్టబద్ధ అనుమతి ఉన్న అతి కొన్ని దేశాలలో భారత్ ఒకటి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న వ్యవహారమే. భారతదేశంలో ప్రతిరోజు దాదాపు పదిలక్షలకు పైగా ఫోన్‌కాల్స్‌ను కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏడు నిఘా సంస్థలు పరిశీలిస్తుంటాయి. విదేశాలలోని భారతీయ దౌత్యకార్యాలయాలలో కేంద్రీకృతమై ఉండే ‘రా’ నిఘా విభాగం కూడా అందులో ఒకటి. ఫోన్లు, మెసేజీలను ట్యాపింగ్ చేసే రాష్ట్రాలలో తెలంగాణ సైతం ఉంది.


జాతిభద్రత, శ్రేయస్సు కోసం ఉగ్రవాదులు, నేరస్థులపై సారించవలసిన నిఘా నేత్రం పాలకుల విధానాలను విమర్శించే వారిని వెంటాడడం అనేది భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతోంది. ఇటీవలికాలంలో అసమ్మతి గళాలను పాలకులు నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్న నేపథ్యంలో పెగాసస్ ఉదంతానికి ప్రాధాన్యం లభించింది.


జాతిభద్రత పేరిట తమ ప్రత్యర్థులు, పాత్రికేయులు ఇతర వ్యక్తుల గోప్యతను హరించడంలో నరేంద్ర మోదీ కంటే ముందు ఉన్న ప్రధానులందరికీ భాగస్వామ్యం ఉంది. వారంతా తమకు తోచిన విధంగా ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారు. అయితే, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి అత్యాధునిక పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినట్లు వెల్లడి కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇది ముమ్మాటికీ రాజద్రోహమని కాంగ్రెస్ అంటోంది కానీ, ఇందిరాగాంధీ హయంలో ముఖ్యమంత్రుల ఫోన్లు, రాజీవ్‌ హయాంలో కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయి. చివరకు కాంగ్రెస్ తన హయాంలో, ఒక్క ఫోన్లే కాదు సర్వవిధాల సమాచారాన్ని సేకరించడానికి చట్టబద్ధ వ్యవస్థకు 2011లోనే శ్రీకారం చుట్టింది. దీని ద్వారా సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా, శాంతిభద్రతలు రాష్ట్రాల అంశమైనప్పటికీ వాటి ప్రమేయం లేకుండా నేరుగా కేంద్రమే ఫోన్లు, మెసేజీలు, మెయిళ్ళు, ఫోటోలు వగైరా సేకరించే సెంట్రల్ మానిటరింగ్ సిస్టం (సియంఎస్) విధానాన్ని 800 కోట్ల రూపాయలతో ప్రారంభించింది. సియంయస్ విధానం ఎదుటి వారికి తెలియకుండా వారి ఫోన్ల సంభాషణను, మెసేజీలను, ఫోన్ లోని ప్రతి ఆంశాన్ని గమనిస్తూ నిక్షిప్తం చేస్తుంది. నాట్ గ్రిడ్ విధానం అనేది పౌరుడికి సంబంధించిన 21 రకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతుంది. అదే విధంగా, నెట్రా అనేది ఒక్క సామాజిక మాధ్యమాలలోనే కాదు, మన కంప్యూటర్‌లో ఏమేం ఉన్నాయో తెలుసుకోగలుగుతుంది.    వ్యక్తిగత గోప్యతను హరించే ఈ మూడు నిఘా విధానాలు కూడ భారతదేశంలో చట్టబద్ధంగా అమలులో ఉన్నాయి. వీటిని రూపొందించింది కూడ కాంగ్రేస్సే.


ఒక మనిషి కదలికలతో పాటుగా అతని ఆలోచనాసరళిని కూడ గమనించే ఈ నిఘా వ్యవస్థను, ప్రత్యేకించి సియంఎస్‌ను బలోపేతం చేయడానికి బిజెపియేతర పార్టీల పాలనలో ఉన్న తెలంగాణ, కేరళ రాష్ట్రాలు పూర్తిగా సహకరించాయి. ఆవిర్భావమే యుద్ధాలతో మొదలై ఇప్పటికీ నిరంతర ఉద్రిక్తతలతో, చుట్టూ బలీయమైన అరబ్బు దేశాల మధ్యలో ఉన్న ఇజ్రాయేల్ నిఘా సాంకేతిక పరిజ్ఞానానికి పెట్టింది పేరు. భౌగోళికంగా చిన్నదైనప్పటికీ అధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో అగ్రరాజ్యాల సరసన ఉంటుందది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల అణచివేత నుంచి సైబర్ నిఘా వరకు భారతదేశానికి ఇజ్రాయేల్‌ తోడ్పాటు అందించింది. తన పౌరులపై ఉన్న నిఘా కారణంగానే కరోనా వ్యాప్తి నిర్మూలనలో, ఒక్క మధ్యప్రాచ్య దేశాలలోనే కాదు యావత్తు ప్రపంచంలోనే స్వల్పవ్యవధిలో మహమ్మరి వ్యాప్తిని ఆ దేశం విజయవంతంగా నియంత్రించగలిగింది. 


ఇజ్రాయేల్‌కు అనేక అరబ్బుదేశాలతో దౌత్యసంబంధాలు లేనప్పటికీ లోపాయికారీగా వాటికి నిఘా సహకారాన్ని అందిస్తుందని అంటుంటారు. కీలకమైన ఒక అరబ్బు దేశానికి చెందిన నిఘా అధికారిని, ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచయినా ఒక ఐ ఫోన్ కొనుగోలు చేసి అందులో సిమ్‌కార్డు వేసి దాని నెంబర్‌ను చెప్పమని అడిగి, వెంటనే దాన్ని హ్యాక్ చేసి ప్రదర్శించినట్లుగా వాషింగ్టన్ పోస్టు వెల్లడించిన కథనం పెగాసస్ సామర్థ్యానికి ప్రతీక. ఫోన్లను హ్యాకింగ్ చేసే విభిన్న రకాల సాఫ్ట్‌వేర్లను అనేకదేశాలు వినియోగిస్తున్నా పెగాసస్ అందులో అత్యాధునికమైంది. అన్ని రకాల ఆండ్రాయిడ్, ఐఓయస్, బ్లాక్‌బెర్రీ వంటి తాజా అపరేటింగ్ సిస్టంలున్న ఫోన్లను ఇది సునాయసంగా హ్యాక్ చేయగలుగుతుందనే వార్తలు వచ్చాయి. దేశ సరిహద్దు ఆవలి శత్రువులపై ఎక్కుపెట్టాల్సిన నిఘా పరిజ్ఞానాన్ని, పదునైన చట్టాలను పాలకులు తమను ప్రశ్నిస్తున్న గొంతుకలపై వినియోగిస్తుండడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న ఆంశం.


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.