Abn logo
Feb 21 2020 @ 04:12AM

రాజధానిలో హద్దులు దాటిన నిఘా

పైకప్పులేని బాత్రూమ్‌లపై కెమెరా కన్ను

డ్రోన్ల ప్రయోగంపై మండిపడ్డ మందడం

ప్రశ్నించిన వారిపై పోలీసు జులుం

జేఏసీ కో కన్వీనర్‌ మెడపట్టుకున్న డీఎస్పీ

దూషించి దాడి చేశారని రైతుల ఆరోపణ

గుంటూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆందోళనలు, నిరసన ప్రదర్శనలను చిత్రీకరించాల్సిన పోలీసుల డ్రోన్లు.... సామాన్యుల ఇళ్లపై ఎగురుతున్నాయి. అమరావతి ఉద్యమంపై నిఘా కన్ను వేసేందుకు అన్ని హద్దులూ దాటుతున్నాయి. తమవి పల్లెలని, పైకప్పుల్లేని స్నానాల గదులూ ఉన్నాయని... దయచేసి డ్రోన్లను గ్రామాలపై తిప్పవద్దని మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. తమపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం మందడంలో రైతులు, మహిళలు రోడ్లపై ఽధర్నాకు దిగారు. పోలీసులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డ్రోన్‌ కెమెరాతో వీడియోలను చిత్రీకరించారు. ఇదే క్రమంలో... ఒక మహిళ స్నానాల గదిలో ఉండగా పైకప్పులేని బాత్రూమ్‌పైనా డ్రోన్‌ కెమెరా తిరిగింది. ‘మా ఇంటిపైన డ్రోన్‌ ఎగిరింది.


అ సమయంలో మా అక్క స్నానాల గదిలో ఉంది. దానికి పైకప్పు లేదు. ఫ్యాన్‌ తిరుగుతున్నట్లు శబ్దం వస్తుంది చూడమని బాత్‌రూం నుంచి మా అక్క చెప్పగా... మా అబ్బాయి బయటకు వచ్చి చూడగా పైన డ్రోన్‌ కనిపించింది’’ అని ఒక వ్యక్తి సహచర గ్రామస్థులకు తెలిపారు. దీంతో... మహిళలు, రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది.  డ్రోన్‌ ఆపరేట్‌ చేస్తున్న వ్యక్తి ఆచూకిని తెలుసుకుని అతని వద్ద ఉన్న వస్తువులను లాక్కున్నారు. డ్రోన్‌ను దించి గ్రామస్థులు తీసుకున్నారు. ఈ దశలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పోలీసు బలగాలతో రంగప్రవేశం చేయటంతో వాతావరణం మరింత వేడెక్కింది.


జేఏసీ కో కన్వీనర్‌పై దాడి...

డ్రోన్లతో చిత్రీకరించడాన్ని ప్రశ్నించిన పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. జేఏసీ కో కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కిందకు తోసి మెడపట్టుకున్నారు. మరో జేఏసీ నేత గద్దె తిరుపతిరావును పక్కకు తోశారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడికి పెద్దఎత్తున మహిళలు చేరుకొని సుధాకర్‌కు రక్షణగా నిలిచి దీక్షా శిబిరం వరకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో దాదాపు 45 నిమిషాల పాటు పోలీసులు, రైతుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సుధాకర్‌ను డీఎస్పీ ‘‘లం.... కొడకా! నీ వల్లనే ఇదంతా జరుగుతోంది. నిన్ను లోపలేస్తే పోతుందని గొంతు పట్టుకున్నారు’’ అని ఒక మ హిళ వివరించింది. డ్రోన్‌ కెమెరాలను ప్రయోగించడంతోపా టు దౌర్జన్యంపై ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు.


సుధాకర్‌పై హత్యాయత్నం చేశారు!

జేఏసీ కో- కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గొంతుపట్టుకొని కిందకు పడేసి హత్యాయత్నం చేశారంటూ పలువురు మహిళలు టీడీపీ  నిజనిర్ధారణ కమిటీకి వెల్లడించారు. ఎమ్మెల్యే  నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ మంత్రి జవహర్‌, మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు, గుంటూరుజిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు  గురువారం రాత్రి మందడంలో పర్యటించారు.  


నాకు కులం ఆపాదిస్తారా?

‘చంద్రబాబు తెలివిగలోడు.. నిన్ను అడ్డు పెట్టుకొని జేఏసీ నడిపిస్తున్నాడు. ఎస్సీ అయ్యి బతికిపోయావు.... లం... కొడకా!’  అని నన్ను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి దూషించారు.  అడ్డుకోవటానికి పోయిన నాకు కులం ఆపాదించి తిట్టారు. మా అమ్మ క్రిస్టియన్‌.  మా నాన్న హిందువు. మా పాప పేరు ఏ కులానికి, మతానికి చెందకుండా అక్షరా అని పెట్టాను. అలాంటి నాకు కులం ఆపాదిస్తున్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదు. అమరావతి సాధించే వరకు పోరు ఆగదు.

 జేఏసీ నేత కె.శ్రీనివాస్‌

Advertisement
Advertisement
Advertisement