Abn logo
Oct 16 2021 @ 00:00AM

మనోడే అని నమ్మారో నిండా ముంచేస్తారు..!

  • ష్యూరిటీతో చిక్కులు.. హానికరంగా హామీలు
  • కఠినతరంగా మారిన రెవెన్యూ రికవరీ యాక్టు
  • అప్పు తీసుకున్న వాళ్లు చెల్లించకుంటే హమీదారుడే బాధ్యుడు
  • ప్రైవేటు ఫైనాన్స్‌లూ సిబిల్‌ స్కోరు చూస్తున్నాయ్


ఒకటా.. రెండా.. వందలాది నమ్మక ద్రోహాలు.. మనోడే కదాని హామీ ఉన్న పాపానికి నిలువునా ముంచేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్నేహితుడనో.. బంధువులనో.. పరిచయస్తులనో.. మనోడు చెప్పాడనో.. ఆర్థిక లావాదేవీల్లో హామీ ఉన్నప్పుడు.. అవతలి వారు ఆ రుణాలను సక్రమంగా చెల్లించనప్పుడు నిండా మునిగిపోతున్నారు. మోసపోయిన వాళ్లు న్యాయమో రామచంద్రా అంటుంటే.. చేసిన వాళ్లు దాని నుంచి ఎలా తప్పించుకోవాలోనని ఆలోచిస్తున్నారు. కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త ! మనోడి మోసాలపై పత్యేక కథనం.

పాలకొల్లు, అక్టోబరు 16: 


ఒక్కొక్క మోసానిది.. ఒక్కో కథ

ఆ నలుగురూ ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగులు. అందులో ఒకరు ఓ చిట్‌ ఫండ్‌ కంపెనీలో పాట పాడి హామీ కోసం ముగ్గురు ఉద్యోగులతో ష్యూరిటీ సంతకాలు పెట్టించాడు. మూడు నెలలు బాగానే గడిచింది. నాలుగో నెల నుంచి వాయిదాలు చెల్లించకపోవడంతో  ష్యూరిటీదారులకు చిట్‌ ఫండ్‌ కంపెనీ నుంచి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. ముగ్గురు అతన్ని నిలదీయడంతో మీకు మాట రానివ్వను.. త్వరలోనే కట్టేస్తానని చెప్పాడు. అయినా ఫలితం లేకపోవడంతో వీరు తలలు పట్టుకున్నారు.


అతనో ప్రభుత్వోద్యోగి. ఎవరైనా ష్యూరిటీ అడిగితే.. కాస్త మొత్తం తీసుకుని సంతకం పెడతాడు. ఓ ఏడాది ఇద్దరు వ్యక్తులు ఓ ఫైనాన్సరు వద్ద అప్పు తీసుకుని, అతనితో సంతకాలు చేయించుకున్నారు. తర్వాత వారు వాయిదాలు కట్టడం మానేయడంతో.. ష్యూరిటీ ఉన్న పాపానికి ప్రతి నెలా ఇతని జీతం నుంచి మినహాయిస్తున్నారు. అప్పు తీసుకున్న వాళ్ల చుట్టూ ఎంతో కొంత కట్టండి బాబూ అంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. 

చేతిలో సొమ్ములు పడేసరికి.. 

ఆ సోదరులిద్దరినీ అన్యోన్యంలో రామ లక్ష్మణులుగా అంతా అనుకునేవారు. ఇద్దరికి ఆస్తి పంపకాలు జరిగాయి. అన్నకు వచ్చిన ఆస్తిని తమ్ముడికి అమ్మేశాడు. అన్నపై నమ్మకంతో కాగితం కూడా లేకుండా అనుకున్న సొమ్ము ముట్టజెప్పాడు. నగదు చేతికి రాగానే సీన్‌ మారిపోయింది. తనకు ఆస్తి అమ్మే ఉద్దేశం లేదని అన్న తేల్చి చెప్పాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఐదేళ్లవుతోంది. ఈ విషయాన్ని పెద్దల్లో పెడదామంటే కుటుంబ పరువు పోతుందని తమ్ముడు ఏం చేయాలో తెలియక మదనపడుతున్నాడు. 


డబ్బు తర్వాతే ఏదైనా..

ఆర్థిక అవసరాలు మానవ సంబంధాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. అవసరం నిమిత్తం అప్పులు చేసే సందర్భం లో వారి బంధువులు, మిత్రులు ఇచ్చే హామీలు కొన్ని సంద ర్భాల్లో ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణ మిత్రులకైనా.. సొంత అన్నదమ్ములకైనా ఆర్థిక అవస రాల నిమిత్తం హామీ సంతకాలు చేయాలంటే హడలిపోతు న్నారు. గతంలో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే ఆ పట్టణం లోని మిగిలిన బ్యాంకులలో ఏ విధమైనా రుణాలు లేవని ధ్రువీకరణ చేయించుకుని అనంతరం రుణాలు మంజూరు చేసే వారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రుణం పొందే వ్యక్తి పాన్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌ల ఆధారంగా సిబిల్‌ స్కోర్‌ తెలుస్తోంది. అతడు అప్పటికే ప్రైవేటు లేదా ప్రభుత్వరంగ బ్యాంకు లలో రుణాలు పొంది సకాలం లో వాయిదాలు చెల్లించకుం డా ఉంటే సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోతుంది. దీని ఆధారంగా అతడికి బ్యాంకులు రుణం మంజూరు చేయడానికి వీలుపడదు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు చిన్నతరహా ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు సిబిల్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటు న్నాయి. దీంతో రుణం పొందేవారు తాము చేయని తప్పునకు బాధ్యత వహించాల్సి వస్తోంది. ప్రతాప్‌(పేరు మార్చాం) బ్యాంకులో రుణం తీసుకుని కొత్త కారు కొన్నాడు. ఇందుకు మిత్రుడు పవన్‌ ష్యూరిటీ సంతకం చేశాడు. అయితే లోను తీసుకున్న తర్వాత ప్రతాప్‌ వాయిదాలు సకాలంలో చెల్లించ కపోవడంతో బ్యాంకు అధికారులు కారును జప్తు చేశారు. కారు అమ్మినప్పటికీ రుణం తీరకపోవడం.. అతని పేరున ఏ విధమైన ఆస్తులు లేకపోవడంతో రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం హామీదారుడు పవన్‌కు నోటీసులు ఇచ్చి మిగిలిన బాకీ మొత్తాన్ని వసూలు చేశారు. మరో కథ చూస్తే.. పాల కొల్లుకు చెందిన అజయ్‌(పేరు మార్చాం) ఓ చిట్‌ కంపెనీలో రూ.10 లక్షలు పాడుకుని మిత్రులతో హామీ సంతకాలు చేయించా డు. శక్తికి మించిన ఖర్చుతో ఇల్లు కట్టి అప్పులపాల య్యాడు. సకాలంలో చిట్‌ వాయిదాలు చెల్లించలేకపోవడంంతో హామీ వున్న మిత్రులకు చిట్‌ కంపెనీ నోటీసులు ఇచ్చింది. రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం బకాయి సొమ్ము చెల్లించాలని ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ష్యూరిటీదారులు ముగ్గురిలో ఒకరు ఉద్యోగి, ఇద్దరు వ్యాపారులు. రికవరీకి ముందుగా ఉద్యోగి దొరికిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక వీరు తలలు పట్టుకున్నారు. మిత్రులుగా నమ్మి హామీలు ఇచ్చి, ఆనక ఇరుక్కుపోయి ఆర్థికంగా నష్టపోతున్న సంఘటనలు జిల్లాలో నిత్యం వెలుగుచూస్తేనే ఉన్నాయి. 

హామీ ఇచ్చే ముందు ఆలోచించాలి

సాధారణంగా చిట్‌ఫండ్‌ కంపెనీలు చిట్‌ విలువకు సరిపడా ముగ్గురు లేదా నలుగురితో హామీ సంతకాలు తీసు కుంటారు. చిట్‌ పాడుకున్న వ్యక్తి వాయిదాలు చెల్లించకపోతే హామీ ఇచ్చిన వ్యక్తుల నుంచి బకాయి సొమ్ము రికవరీ చేస్తారు. వ్యక్తులు రుణాలు తీసుకునే సందర్భంలో జాగ్ర త్తలు పాటించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. బం ధువులు లేదా మిత్రులను బలి చేయకుండా తమ సొంత ఆస్తులను హామీగా చూపించి రుణం పొందవచ్చని చెబుతు న్నారు. ఇలా చేయడం ద్వారా వాయిదాలు సక్రమంగా చెల్లించడానికి రుణ గ్రహీతలు బాధ్యత కలిగి ఉంటారని   ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అప్పులపాలైన వ్యక్తులు  కొన్ని సందర్భాలలో ఐపీ(ఇన్‌సాల్వన్సీ పిటిషన్‌) దాఖలు చేస్తున్నారు. డెటార్‌ ఐపీ, క్రెడిటార్‌ ఐపీ విధానాలలో మొత్తంగా ఐపీ పెట్టిన వ్యక్తి వద్ద ఏమి లేకుంటే  భవిష్యత్తులో 15 ఏళ్లలోపుగా ఐపీ పెట్టిన వ్యక్తి ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే బాకీలను రాబట్టుకునే వెసులుబాటును చట్టం కల్పిస్తుంది.

మీకు సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోయింది

ప్రణీత్‌ పాతిక వేలు విలువైన సెల్‌ఫోన్‌ను ఫైనాన్స్‌లో కొందామని దసరా పండుగ రోజు షోరూంకు వెళ్లాడు. ఇతని ఆధార్‌, ఫోన్‌ నెంబ ర్‌, ఇతర వివరాలను పరిశీలించిన షోరూం నిర్వాహకులు.. ఫైనాన్స్‌ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఎందుకని అడిగితే క్రెడిట్‌ ఇన్‌ఫర్మే షన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) స్కోర్‌ తక్కువగా ఉందని, అలా ఉంటే ఫైనాన్స్‌ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. అతను ఏ బ్యాంకులోనూ రుణం తీసుకోలేదు. ప్రైవేటు ఫైనాన్స్‌ అప్పులు లేవు. సిబిల్‌ ఇబ్బందులు ఏమిటో అర్థం కాలేదు. తనకు సేవింగ్‌ అకౌంట్‌ వున్న బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. అదే బ్యాంకులో గృహ రుణం తీసుకున్న మిత్రుడికి ప్రణీత్‌ హామీ సంతకం పెట్టాడు. అతడు వాయిదాలు సకా లంలో చెల్లించకపోవడంతో అతడితోపాటు ప్రణీత్‌ సిబిల్‌ స్కోరు పడిపోయింది. కరోనా కారణంగా వ్యాపారాలు సరిగా లేక వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోతున్నానని మిత్రుడు చెప్పినప్పటికీ హామీ ఇచ్చిన పాపానికి సెల్‌ ఫోన్‌కి ఫైనాన్స్‌ పొందలేకపోయానని ప్రణీత్‌ ఆవేదన చెందాడు.


చట్టంలో ఏముంది?

హామీ ఇచ్చిన వ్యక్తులు తాము బాకీ తీర్చే పరిస్థితి  ఏర్పడినప్పుడు మూడేళ్ల కాలంలో తాము హామీ పెట్టిన వ్యక్తి నుంచి సొమ్ములు రికవరీ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. ఇటీవల ఐపీల సంఖ్య పెరిగింది. వ్యాపారాలు సక్రమంగా నడిచినంత కాలం ఇబ్బందులు లేనప్పటికీ రాత్రికి రాత్రి బోర్డు తిప్పేస్తున్నారు. కోర్టును ఆశ్రయిస్తున్న దివాళదారుల్లో కొందరు ముందుగానే తమకున్న ఆస్తులను కుటుంబ సభ్యుల పేరున బదలాయించి తాను పాపర్‌నయ్యానంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇలా ఆర్థిక మోసాలకు కొందరు ఉద్దేశ పూర్వకంగా పాల్పడుతుంటే, మరికొందరు అనుకోని పరిస్థితుల్లో అయిన వారికి హామీలు ఇచ్చి ఇబ్బందులలో ఇరుక్కుపోతున్నారు.