Suresh Raina: ‘నేను కూడా బ్రాహ్మణుడినే’ వ్యాఖ్యలపై దుమారం

ABN , First Publish Date - 2021-07-22T22:20:54+05:30 IST

‘‘నేను కూడా బ్రాహ్మణుడినే’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర

Suresh Raina: ‘నేను కూడా బ్రాహ్మణుడినే’ వ్యాఖ్యలపై దుమారం

చెన్నై: ‘‘నేను కూడా బ్రాహ్మణుడినే’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌‌కు సురేశ్ రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా రైనాను ఉద్దేశించి సహచర కామెంటేటర్ మాట్లాడుతూ... ధోతీ ధరిస్తూ, విజిలేస్తూ, డ్యాన్స్ చేస్తూ చెన్నై సంస్కృతిలో ఎలా కలిసిపోయావని ప్రశ్నించాడు. 


దీనికి రైనా స్పందిస్తూ.. ‘‘నేను కూడా బ్రాహ్మణుడినేనని అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. నేను నా సహచరులను ఇష్టపడతాను. ఇక్కడి సంస్కృతిని ఎంతగానో ఇష్టపడతాను’’ అని పేర్కొన్నాడు.  రైనా చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.


చెన్నై అంటే బ్రాహ్మణులు తప్ప మరెవరూ ఉండరా? అంటూ రైనాపై విరుచుకుపడుతున్నారు. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నా ఇక్కడి నిజమైన సంస్కృతి గురించి పూర్తిగా తెలిసినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలని దుమ్మెత్తిపోశారు. తనకు రైనా అంటే ఎంతో ఇష్టమని, కానీ ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత అతడిపై ఇష్టం పోయిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


రైనా గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న రైనా ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Updated Date - 2021-07-22T22:20:54+05:30 IST