విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప, దృశ్యం2’ చిత్రాల్ని ఓటీటీలో విడుదల చేసి మంచి లాభాలు అందుకున్న సురేశ్ ప్రొడక్షన్స్ వారు.. ఏపీలోని పరిస్థితుల దృష్ట్యా.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు చిత్రాల్ని ఓటీటీలకే అమ్మాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బ్లాక్ కామెడీ కాప్ చిత్రం ‘శాకినీ డాకినీ’ని ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. సూపర్ హిట్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ కిది అఫీషియల్ రీమేక్. ఇందులో నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారికే ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం వారితో సురేశ్ ప్రొడక్షన్స్ చర్చలు జరుపుతోందట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. పోలీస్ ట్రైనీలుగా వెళ్ళిన ఇద్దరు అమ్మాయిలకు హ్యూమన్ ట్రాఫికర్స్ తో తలపడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. చివరికి వారిద్దరూ దాన్నుంచి ఎలా బైట పడ్డారు అన్నదే చిత్ర కథాంశం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా నిజంగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందో లేక థియేర్స్ లో వస్తుందో చూడాలి.