‘ఖేల్‌రత్న’కు సురేఖ, రాణి

ABN , First Publish Date - 2020-06-03T09:05:53+05:30 IST

దేశ క్రీడా అత్యున్నత పురస్కారాల దరఖాస్తు గడువు బుధవారంతో ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు తమ ...

‘ఖేల్‌రత్న’కు సురేఖ, రాణి

 ‘అర్జున’కు రజని, సాత్విక్‌ 

 ద్రోణాచార్యకు పద్మజ, భాస్కర్‌ పేర్లు సిఫారసు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దేశ క్రీడా అత్యున్నత పురస్కారాల దరఖాస్తు గడువు బుధవారంతో ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు తమ ఆటగాళ్ల పేర్లను సిఫారసు చేసే పనిలో తలమునకలై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యువ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను, జాతీయ హాకీ సమాఖ్య మహిళల జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ను, భారత టేబుల్‌ టెన్నిస్‌ సంఘం మనికా బాత్రా పేరును ఖేల్‌రత్న పురస్కారానికి, భారత బ్యాడ్మింటన్‌ సంఘం సాత్విక్‌ సాయిరాజ్‌ను అర్జున అవార్డుకు ప్రతిపాదిస్తూ కేంద్ర యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శికి మంగళవారం లేఖలు రాశాయి. సురేఖతో పాటు  ఏపీ ప్రభుత్వం యతిమరపు రజని (హాకీ), రాయుడు అరుణ్‌ కుమార్‌ (రోలర్‌ స్కేటింగ్‌), ఫర్హీన్‌ షేక్‌ (రోలర్‌ స్కేటింగ్‌), ప్రియమ్‌ (స్కేటింగ్‌)ను అర్జునకు, పి.పద్మజ బాల (కబడ్డీ కోచ్‌), పి.భాస్కర్‌ బాబు (బ్యాడ్మింటన్‌ కోచ్‌), పంచాడ సత్యనారాయణ (రోలర్‌ స్కేటింగ్‌) ద్రోణాచార్యకు, చింతా ప్రతాప్‌ కుమార్‌ (అథ్లెటిక్స్‌) పేరును ధ్యాన్‌చంద్‌ అవార్డుకు సిఫారసు చేసింది. జాతీయ హాకీ సమాఖ్య రాణితో పాటు ఆమె సహచరులు వందనా కటారియా, మోనిక, పురుషుల హాకీ జట్టు డిఫెండర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ను అర్జునకు, ఆర్పీ సింగ్‌, తుషార్‌ ఖండేకర్‌ను ధ్యాన్‌చంద్‌ జీవితకాల పురస్కారానికి, కోచ్‌లు బీజే కరియప్ప, రమేష్‌ పథానియాను ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించింది. భారత బ్యాడ్మింటన్‌ పురుషుల స్టార్‌ జోడీ, ప్రపంచ డబుల్స్‌ పదో ర్యాంకర్‌ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)- చిరాగ్‌ శెట్టి ద్వయాన్ని జాతీయ బ్యాడ్మింటన్‌ సంఘం అర్జున అవార్డుకు ప్రతిపాదించింది.


వీరితో పాటు సింగిల్స్‌ ఆటగాడు సమీర్‌ వర్మను అర్జునకు, కోచ్‌ ఎస్‌.మురళీధరన్‌ను ద్రోణాచార్యకు, గంధె ప్రదీప్‌, మంజుషా కన్వార్‌ను ధ్యాన్‌చంద్‌ అవార్డుకు సిఫారసు చేసింది. ఇక, భారత టేబుల్‌ టెన్నిస్‌ యువ సంచలనం మనికా బాత్రాను ఖేల్‌రత్న పురస్కారానికి జాతీయ టీటీ సంఘం నామినేట్‌ చేసింది. గత ఏడాది కూడా మనికా పేరును టీటీ సంఘం సిఫారసు చేసింది కానీ, ఆమెకు తుది జాబితాలో చోటు దక్కలేదు. మనికాతో పాటు మధురిక పట్కర్‌, మనవ్‌ ఠక్కర్‌, సుతిరత ముఖర్జీ పేర్లను అర్జునకు, కోచ్‌లు జయంత పుషిలాల్‌, ఎస్‌.రామన్‌ను ద్రోణాచార్య అవార్డులకు ప్రతిపాదించింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తులన్నింటిని పరిశీలించి తుది జాబితా ప్రకటించాక జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న)నాడు అవార్డులను ప్రదానం చేస్తుంది.

Updated Date - 2020-06-03T09:05:53+05:30 IST