కొవిడ్‌పై సుప్రీం కొరడా

ABN , First Publish Date - 2020-11-28T07:29:20+05:30 IST

దేశంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్న వేళ- ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మరోమారు తీవ్రంగా హెచ్చరించింది. మార్గదర్శకాలు మాత్రమే చాలవు... కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిందే అని నిష్కర్షగా స్పష్టం చేసింది. ’పరిస్థితి మరింత దిగజారింది

కొవిడ్‌పై సుప్రీం కొరడా

కఠిన చర్యలు తీసుకోండి

వ్యాక్సిన్‌ వచ్చే దాకా ఆంక్షలుండాల్సిందే

రాజకీయాలకతీతంగా రాష్ట్రాలు వ్యవహరించాలి

విపత్కర పరిస్థితులపై స్పందించాలని ఆదేశం


న్యూఢిల్లీ, నవంబరు 27: దేశంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్న వేళ- ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మరోమారు తీవ్రంగా హెచ్చరించింది. మార్గదర్శకాలు మాత్రమే చాలవు... కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిందే అని నిష్కర్షగా స్పష్టం చేసింది. ’పరిస్థితి మరింత దిగజారింది. విధాన నిర్ణయాలు, మార్గదర్శకాలు, అమలుకు సంబంధించిన విధివిధానాలు(ఎస్‌వోపీ)... అన్నింటినీ రూపొందిస్తున్నారు తప్పితే వాటి అమలుకు అధికార యంత్రాంగం కృషి చేయడం లేదు. నిర్దిష్ట చర్యలు తీసుకొన్న దాఖలాలు కనబడడం లేదు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయమొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనాలి’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి సభ్యులుగా ఉన్న త్రిసభ్య ధర్మాసనం కోరింది. గతసారి కంటే ఈసారి వచ్చిన సెకెండ్‌ వేవ్‌ మరింత కర్కశంగా ఉండబోతోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నపుడు- మరి తీవ్ర చర్యలకు ఇంకా ఆలస్యమెందుకు..? అని బెంచ్‌  ప్రశ్నించింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేదాకా ఆంక్షలను కొనసాగించాలని కోరింది.


కొవిడ్‌ రోగులకు చికిత్స, మృతదేహాలను గౌరవప్రదమైన రీతిలో అప్పగించడం... మొదలైన అంశాలపై స్వచ్ఛందంగా కేసు విచారణను మొదలెట్టిన సుప్రీంకోర్టు- ఈ విషయంలో రాష్ట్రాలు మరింత చొరవ చూపాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు గనక తగిన చర్యలు చేపట్టకపోతే కేంద్రం సూచించిన మార్గదర్శకాలకు విలువ ఉండదన్న సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయంతో బెంచ్‌ ఏకీభవించింది. కేసు విచారణను కోర్టు డిసెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. కాగా, రాజ్‌కోట్‌లో కొవిడ్‌ ఆస్పత్రి  అగ్నిప్రమాద ఘటనపై కోర్టు  దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ప్రత్యేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా చర్యలు తీసుకోరా.. అని ప్రశ్నించింది. దీనిపై వెంటనే హోంశాఖ కార్యదర్శి ఓ సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు పంపేట్లు చూస్తామని మెహతా విన్నవించారు. 


77శాతం కేసులు ఈ 10 రాష్ట్రాల్లోనే!

దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ కేసుల సంఖ్య 92 లక్షలు దాటిందని, ఇందులో 86 లక్షల మంది- అంటే 93.76 శాతం మంది కోలుకున్నారని  కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియపర్చింది. 77 శాతం కేసులు ఓ పదిరాష్ట్రాల్లో నమోదయ్యాయని, వీటిలో మహారాష్ట్ర, కేరళ మాత్రమే - రోజుకు 50వేల కేసుల పైన అంటే 33 శాతం దాకా నమోదవుతున్నాయని  హోంశాఖ సమర్పించిన ఓ అఫిడవిట్‌ విశదీకరించింది. ఈ పది రాష్ట్రాలు: మహారాష్ట్ర (18.9 శాతం), కేరళ (14.7 శాతం), ఢిల్లీ (8.5), బెంగాల్‌ (5.7), కర్ణాటక (5.6), రాజస్థాన్‌ (5.5), యూపీ (5.4), ఛత్తీ్‌సగఢ్‌ (5), హరియాణ (4.7), ఆంధ్రప్రదేశ్‌ (3.1 శాతం). మరణాల సగటు అంతర్జాతీయంగా  2.36 శాతం ఉంటే భారత్‌లో 1.46 ఉందని వివరించింది. 

Updated Date - 2020-11-28T07:29:20+05:30 IST