న్యూఢిల్లీ: కొవిడ్ మృతుల కుటుంబాలకు 50 రూపాయల వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) చేసిన సిఫారసుపై సుప్రీంకోర్టు సంతోషం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం చాలా మందికి ఓదార్పునిస్తుందని, బాధపడే వ్యక్తుల కన్నీళ్లను తుడించేందుకు ఏదో రూపంలో ఏదో ఒకటి చేస్తున్నందుకు సంతోషమని ధర్మాసనం గురువారం ప్రకటించింది. కాగా, సుప్రీం కోర్టు అభిప్రాయంపై సోలిసిటర్ జనరల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘సాధ్యమైనంతలో చేసి తీరుతాం’’ అని ధర్మాసనానికి తెలిపారు.
కొవిడ్ మరణాలకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వొచ్చని బుధవారం కేంద్రం తెలిపింది. అయితే ఎక్స్గ్రేషియాలను రాష్ట్రాలు వాటి విపత్తు స్పందన నిధి(ఎస్డీఆర్ఎఫ్) నుంచి చెల్లిస్తాయని తెలిపింది. భవిష్యత్తులో ఏవైనా కొవిడ్ మరణాలు సంభవించినా ఎక్స్‌గ్రేషియా వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే ప్రత్యేక దరఖాస్తుపత్రాల ద్వారా కొవిడ్ మృతుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు విజ్ఞప్తులు సమర్పించవచ్చని సర్కారు తెలిపింది. ధ్రువపత్రాలన్నీ అందిన 30 రోజుల్లోగా దరఖాస్తును పరిష్కరించి, లబ్ధిదారుడి ఆధార్ నంబర్ అనుసంధానిత బ్యాంకు ఖాతాకు ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని బదిలీ చేయాలని కేంద్రం నిర్దేశించింది.