జ్ఞానవాపి మసీదులో సర్వే.. స్టేకు సుప్రీం నో

ABN , First Publish Date - 2022-05-14T08:13:58+05:30 IST

వారాణసీలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం..

జ్ఞానవాపి మసీదులో సర్వే.. స్టేకు సుప్రీం నో

వారాణసీ స్థానిక కోర్టు ఆదేశాలు

పరిశీలించాకే నిర్ణయమని వెల్లడి


న్యూఢిల్లీ, లఖ్‌నవూ, మే 13: వారాణసీలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ వారాణసీలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదును.. అటు హిందూవులు, ఇటు ముస్లింలు తమదేనని వాదిస్తూ వస్తున్నారు. ఈ వివాదం కోర్టులదాకా వెళ్లడంతో వారాణసీ స్థానిక కోర్టు ఈ మసీదులో వీడియో సర్వే చేపట్టాలని ఆదేశించింది. దీంతో శనివారం నుంచి ఇక్కడ వీడియో సర్వే ప్రారంభంకానుంది. అయితే ఈ సర్వే చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లీ నేతృత్వంలోని బెంచ్‌ శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మది వాదనలు వినిపిస్తూ.. జ్ఞానవాపి మసీదు చాలా పురాతనమైనదని, దీనిలో ఎన్నో ఏళ్ల నుంచి ముస్లింలు పార్థనలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ మసీదులో వీడియో సర్వే చేయాలని వారాణసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని, దీనిపై యథాతథ స్థితి కొనసాగించాలని కోరారు. దీనిపై జస్టిస్‌ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఈ వివాదం గురించి తనకు ఏమీ తెలియదని, అలాంటప్పుడు ఆదేశాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ఆర్డర్‌ కాపీలు చదివిన తర్వాత ఆదేశాలిస్తామని చెప్పారు.


కాగా, జ్ఞానవాపి మసీదులో సర్వే, వీడియో చిత్రీకరణకు వారాణసీ కోర్టు ఆదేశించడం నిస్సంకోచంగా ప్రార్థనా స్థలాల చట్టం-1991ను ఉల్లంఘించడమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇది బాబ్రీ మసీదు టైటిల్‌ వివాదంలో సుప్రీం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమేనన్నారు. ‘‘నేను బాబ్రీ మసీదును కోల్పోయాను. మరొక మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదు. ఆలిండియా ముస్లిం లా బోర్డు సభ్యులు, మసీదు కమిటీ దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తాయని ఆశిస్తున్నాను’ అని అసద్‌ అన్నారు. 

Read more