సుప్రీం నిర్ణయం!

ABN , First Publish Date - 2022-05-12T09:34:03+05:30 IST

వలస కాలం నాటి రాజద్రోహ చట్టాన్ని తాత్కాలికంగా పక్కకుపెట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ప్రశంసనీయమైనది. తుది నిర్ణయం వెలువడే వరకూ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ఎ కింద కేసులు నమోదు చేయకూడదని...

సుప్రీం నిర్ణయం!

వలస కాలం నాటి రాజద్రోహ చట్టాన్ని తాత్కాలికంగా పక్కకుపెట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ప్రశంసనీయమైనది. తుది నిర్ణయం వెలువడే వరకూ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ఎ కింద కేసులు నమోదు చేయకూడదని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచి ఆదేశించడం స్వాగతించవలసిన పరిణామం. ఇప్పటికే ఈ సెక్షన్ కింద నేరారోపణలు ఎదుర్కొంటూ జైళ్ళలో మగ్గుతున్నవారిని బెయిల్ మీద బయటకు తెచ్చే ఏర్పాట్లు చేయమని కూడ ధర్మాసనం ఆదేశించింది. మధ్యంతర తీర్పే అయినప్పటికీ, తుదితీర్పులో ఏమిచెబుతారన్నది అటుంచితే, ప్రభుత్వం చేతిలోనుంచి ఓ బలమైన ఆయుధాన్ని తాత్కాలికంగానైనా లాగేసినందుకు మెచ్చుకోవలసిందే.


ఈ కేసుకు సంబంధించి మోదీ ప్రభుత్వం అతితెలివి ప్రదర్శించబోయిందని, ప్రధాన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులతో తగిన విరుగుడు మందు వేశారని కొందరి విశ్లేషణ. నిన్నమొన్నటివరకూ రాజద్రోహచట్టం అవశ్యమని మాత్రమే కేంద్రం వాదన. దుర్వినియోగం జరుగుతున్నదని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చునని కేంద్రం చెబుతూ వచ్చింది. ఈ కేసు విచారణకు స్వీకరిస్తూ కేంద్రానికి నోటీసులు ఇస్తున్న సందర్భంలోనే ఈ చట్టంపై సుప్రీంకోర్టు కఠినమైన వ్యాఖ్యలు చేసింది. దాని దుర్వినియోగం తీవ్రస్థాయిలో సాగుతున్నదన్న పిటిషనర్ల అభిప్రాయాన్ని న్యాయస్థానం కూడా వ్యక్తంచేసింది. స్వాతంత్రోద్యమాన్ని అణచివేసేందుకు ఉద్దేశించిన, గాంధీ, తిలక్ వంటివారిపై ప్రయోగించిన ఈ బ్రిటిష్ వారి చట్టం అమతోత్సవ భారతంలో అవసరమా? అని ప్రధాన న్యాయమూర్తి అప్పట్లోనే అడిగారు. ఎడిటర్స్ గిల్డ్, మాజీ మేజర్ జనరల్ ఎస్.జి. వొంబాట్కరే, తణమూల్ ఎంపీ మొహువా మోయిత్రా తమ పిటిషన్లలో కనీసం బెయిల్ కు కూడా అవకాశం లేని ఈ చట్టాన్ని ప్రభుత్వం అసమ్మతిని అణచడానికి ఉపయోగిస్తున్నదనీ, వాక్ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛనూ దెబ్బతీస్తున్నదని ఆరోపించారు. శనివారం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్ లో సైతం ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థించుకొచ్చింది. కానీ, సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్ లో ఇందుకు పూర్తి భిన్నమైన ఒక సరికొత్త వైఖరి ప్రదర్శించింది. చట్టం మంచిచెడ్డలను నిగ్గుతేల్చే, నిబంధనల చెల్లుబాటును పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనవసరంగా తన టైమ్ వేస్టు చేసుకోనక్కరలేదనీ, ఆ పని కేంద్ర ప్రభుత్వమే చేపట్టబోతున్నదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పుకొచ్చారు. ఇక పిటిషన్లపై విచారణ అవసరం లేదనీ, ముగించేయమని అన్నారాయన. ఎన్నో అనవసర చట్టాలను రద్దుచేసి, వందలాది నిబంధనలను ఎత్తిపారేసిన నరేంద్రమోదీకి ప్రజాస్వామ్యం మీదా, పౌరహక్కుల మీదా అపార ప్రేమాభిమానాలున్నాయనీ, ఆయన వ్యక్తిగతంగా హక్కుల పరిరక్షణకు కట్టుబడ్డారని కేంద్రం న్యాయవాది చెప్పుకొచ్చారు. కోర్టులు తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తాయని అర్థమైనప్పుడు ప్రభుత్వాలు ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం కద్దు. కేంద్రం అతితెలివి ప్రదర్శిస్తున్నదనీ, సమీక్ష ఉద్దేశం దానికి లేనేలేదనీ, సమస్యను న్యాయస్థానం చేతిలో నుంచి లాగేసి, పునఃపరిశీలన పేరిట ఏ నిర్ణయమూ చేయకుండా ఏళ్ళకు ఏళ్ళు సాగదీయడం దీని పరమోద్దేశమని పిటిషనర్ల అనుమానం. బీజేపీ ఇన్నేళ్ళలోనూ ఈ చట్టాన్ని మరింత దుర్వినియోగం చేసింది తప్ప ఎన్నడూ దానికి వ్యతిరేకంగా నోరువిప్పలేదు. 


ఈ కారణంగానే కాబోలు, న్యాయస్థానం మంగళవారం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. సదరు సమీక్ష ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించి, అంతవరకూ చట్టం దుర్వినియోగాన్ని నివారించడానికి వీలుగా దాని కింద కేసులు నమోదుచేయకపోవడం గురించి అడిగింది. ఒక శిక్షాస్మృతిని ఉపయోగించవద్దని దేశచరిత్రలో సుప్రీంకోర్టు ఎన్నడూ ఆదేశించలేదని సొలిసిటర్ జనరల్ గుర్తుచేశారు కూడా.


బుధవారం కేంద్రం ప్రతిపాదనలు, పిటిషనర్ల వాదనల అనంతరం న్యాయస్థానం జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో విస్పష్టమైన ఆదేశాలకంటే ఆశాభావాలు, అభ్యర్థనలే అధికమన్న ఆరోపణలను అటుంచితే, అది ఒక మేలిమలుపే. సెక్షన్ 124 ఎ ఒక్కటీ తాత్కాలికంగా పక్కనపెట్టినా పెద్ద ఫలితం ఉండదనీ, మరో నాలుగైదు సెక్షన్లు కలిపి పెట్టిన కేసులే అధికమని హక్కుల సంఘాలు గుర్తుచేస్తున్నాయి. అందువల్ల సుప్రీం ఆశించిన రీతిలో త్వరితగతిన బెయిల్ కు అవకాశం ఉండకపోవచ్చు. కానీ, కొద్దికాలంపాటు కేంద్రానికీ, రాష్ట్రానికీ ఈ ఉత్తర్వులు కొంతలో కొంత సంకెళ్ళు వేస్తాయి కనుక సంతోషించాలి.

Read more