Supreme Court : మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టులు నిరంకుశం కాదు

ABN , First Publish Date - 2022-07-27T21:26:47+05:30 IST

మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ

Supreme Court : మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టులు నిరంకుశం కాదు

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ-Enforcement Directorate) అధికారాలను సుప్రీంకోర్టు (Supreme Court) గట్టిగా సమర్థించింది. నిందితుల అరెస్ట్, దర్యాప్తు తదితర అంశాల్లో ఈడీ అధికారాలను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని దాదాపు అన్ని కఠినమైన నిబంధనలను సమర్థించింది. 


నేర ప్రతిఫలం, సోదాలు జరపడం, ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, నిందితులను అరెస్టు చేయడం, బెయిలు మంజూరు వంటివాటికి సంబంధించిన పీఎంఎల్ఏ నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. నిందితులను అరెస్టు చేసేందుకు అధికారం కల్పిస్తున్న ఈ చట్టంలోని సెక్షన్ 19కి నిరంకుశత్వ దోషం లేదని తెలిపింది. మనీలాండరింగ్‌తో ప్రమేయంగల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన సెక్షన్ 5 కూడా రాజ్యాంగబద్ధమైనదేనని తెలిపింది. 


మనీలాండరింగ్ కేవలం దేశ సాంఘిక, ఆర్థిక కలనేతను ప్రభావితం చేయడం మాత్రమే కాకుండా, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఉన్మత్త పదార్థాల చట్టం (NDPS Act)కు సంబంధించిన అమానుష నేరాలను కూడా ప్రోత్సహిస్తుందని తెలిపింది. ఉగ్రవాదం కన్నా అతి హేయమైన నేరం మరొకటి ఉండదని పేర్కొంది. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్లు 5, 8(4), 15, 17, 19 రాజ్యాంగబద్ధమైనవేనని తెలిపింది. ఈ సెక్షన్ల ప్రకారం నిందితులను అరెస్టు చేయడానికి, ఆస్తులను జప్తు చేయడానికి, సోదాలు నిర్వహించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అధికారం ఉంది. బెయిలు మంజూరు కోసం పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 45 పేర్కొంటున్న జంట షరతులను కూడా అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 


ఈడీ అధికారులు అంటే పోలీసు అధికారులు కాదు 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO), డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (DRI) వంటి దర్యాప్తు సంస్థలు పోలీసు వర్గంలోకి రావని, అందువల్ల ఈ దర్యాప్తు సంస్థలు తాము నిర్వహించే దర్యాప్తు సందర్భంగా నమోదు చేసే స్టేట్‌మెంట్లు చెల్లుబాటయ్యే సాక్ష్యాధారాలుగా పనికొస్తాయని తెలిపింది. CrPC (నేర శిక్షా స్మృతి) ప్రకారం ఈడీ అధికారులు పోలీసు అధికారులు కాదని వివరించింది. ఈడీ అధికారుల సమక్షంలో నమోదు చేసే స్టేట్‌మెంట్లు సాక్ష్యాధారాలుగా చెల్లుబాటవుతాయని పేర్కొంది. 


అరెస్టుకు కారణం చెప్పనక్కర్లేదు 

మనీలాండరింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో, అరెస్ట్ చేయడానికి కారణాన్ని ఈడీ అధికారులు వెల్లడించనక్కర్లేదని తెలిపింది. నిందితునికి ECIR (ఫిర్యాదు నకలు)ను ఈడీ అధికారులు ఇవ్వనక్కర్లేదని పేర్కొంది. మనీలాండరింగ్ అనేది పీఎంఎల్ఏ ప్రకారం ప్రత్యేకమైన నేరమని వివరించింది. భారీ నేరంలో భాగమైన నేర స్వభావానికి లేదా వర్గానికి షెడ్యూలుతో సంబంధం ఉండదని పేర్కొంది. ECIR, FIR సమానం కాదని, భారీ నేరంలో భాగమైన నేరంపై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం ఈడీ దర్యాప్తుకు అడ్డంకి కాదని వివరించింది. 


బెయిలు మంజూరు నిబంధనలు నిరంకుశమైనవి కాదు

పీఎంఎల్ఏలోని వివిధ నిబంధనల చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం ప్రకారం బెయిలు మంజూరుకు సంబంధించిన జంట నిబంధనలు చట్టబద్ధమైనవేనని, ఇవి నిరంకుశమైనవి కాదని చెప్పింది. ఈ చట్టానికి మనీ బిల్లు రూపంలో సవరణలు చేయవచ్చునా? అనే ప్రశ్నపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతుందని తెలిపింది. 


పీఎంఎల్ఏ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం : పిటిషనర్లు

పీఎంఎల్ఏలోని వివిధ అంశాలను ప్రశ్నిస్తూ దాఖలైన సుమారు 100 పిటిషన్లను వర్గీకరించి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, ఈ తీర్పునిచ్చింది. ఈ చట్టం ప్రకారం అరెస్టు చేసే అధికారం, బెయిలు మంజూరు, ఆస్తుల జప్తులకు సంబంధించిన అధికారాలు సీఆర్‌పీసీ పరిధికి అతీతంగా ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు పోలీసు అధికారాలను సమర్థంగా వినియోగిస్తున్నాయని, కాబట్టి సీఆర్‌పీసీని అనుసరించడం తప్పనిసరి చేయాలని పిటిషనర్లు వాదించారు. ఈడీ అనేది పోలీసు సంస్థ కాదని, దర్యాప్తు సందర్భంగా ఈడీకి నిందితులు ఇచ్చే స్టేట్‌మెంట్లను న్యాయ వ్యవహారాల్లో (జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్‌లో) ఆ నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉపయోగించవచ్చునని, ఇది నిందితుల చట్టబద్ధ హక్కులకు వ్యతిరేకమని వాదించారు. 


నిందితులను అరెస్టు చేయడానికి ఈడీకి ఎదురులేని అధికారాలు ఉన్నాయని, అరెస్టుకు కారణాలను లేదా సాక్ష్యాధారాలను వెల్లడించవలసిన అవసరం ఉండటం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. సమాచారాన్ని వెల్లడించకుండా తొక్కిపెడితే జరిమానా విధిస్తారనే బెదిరింపుతో నిందితుడిని ప్రశ్నించే సమయంలో నేరంలో ఇరికించగలిగే స్టేట్‌మెంట్‌ను ఆ నిందితుడి నుంచి సేకరించి, నమోదు చేయడం నిర్బంధించడమే అవుతుందని వాదించారు. 


పీఎంఎల్ఏ అమల్లోకి రావడానికి పూర్వం, అంటే 2002వ సంవత్సరానికి పూర్వం, జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో కూడా ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మనీలాండరింగ్ నిరంతరం కొనసాగే నేరమని కేంద్ర ప్రభుత్వం వాదించింది. 


Updated Date - 2022-07-27T21:26:47+05:30 IST