పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మరో మాట లేదు : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-09-15T00:02:00+05:30 IST

షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఉద్యోగులకు

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మరో మాట లేదు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలనే తీర్పును మరోసారి పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును ఏ విధంగా అమలు చేయాలో నిర్ణయించుకోవలసినది రాష్ట్ర ప్రభుత్వాలేనని స్పష్టం చేసింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల మంజూరులో ఆటంకాలు, సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్న వ్యాజ్యాలపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఈ స్పష్టత ఇచ్చింది. 


నాగరాజు కేసును కానీ, జర్నయిల్ సింగ్ కేసును కానీ తిరిగి పరిశీలించబోమని స్పష్టం చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు విధించిన నిబంధనల ప్రకారం ఈ కేసుల్లో నిర్ణయాలు తీసుకోవాలనేదే ఆలోచన అని తెలిపింది. జస్టిస్ నాగేశ్వర రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ వివరణ ఇచ్చింది. 


తమకు మాత్రమే ప్రత్యేకంగా ఎదురయ్యే సమస్యలను ఖరారు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన విషయాన్ని సుప్రీంకోర్టు మంగళవారం గుర్తు చేసింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనకు ఎదురైన సమస్యలను క్రోడీకరిస్తే, ఈ కేసులో తదుపరి చర్యలకు కోర్టుకు అవకాశం కలుగుతుందని తెలిపింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వెల్లడిస్తున్న సమస్యలు, ఇతరులు ప్రచారం చేస్తున్న సమస్యలు ఈ కేసుల పరిధులను విస్తరిస్తున్నాయని పేర్కొంది. అలా చేయడానికి తమకు ఇష్టం లేదని తెలిపింది. నాగరాజు కేసులో తుది నిర్ణయం ప్రకటించిన అంశాలపై మరోసారి పరిశీలించబోమని తెలిపింది. కేసుల రీఓపెనింగ్ కోసం వాదనలను అనుమతించబోమని చెప్పింది. 


Updated Date - 2021-09-15T00:02:00+05:30 IST