అడ్‌హాక్ జడ్జిల నియామకంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-04-08T21:16:42+05:30 IST

హైకోర్టుల్లో రెగ్యులర్ జడ్జిల నియామకానికి విఘాతం కలిగే విధంగా అడ్ హాక్ జడ్జిల

అడ్‌హాక్ జడ్జిల నియామకంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : హైకోర్టుల్లో రెగ్యులర్ జడ్జిల నియామకానికి విఘాతం కలిగే విధంగా అడ్ హాక్ జడ్జిల నియామకాలు జరగకూడదని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. పెండింగ్ కేసుల భారాన్ని తొలగించాలనే సాకుతో అడ్ హాక్ జడ్జిలను నియమించరాదని పేర్కొంది. పెండింగ్ కేసులు మితిమీరి పెరిగినపుడు హైకోర్టుల్లో రెగ్యులర్ జడ్జిల నియామకానికి చేసే ప్రయత్నాలు ఫలించని సందర్భాల్లో మాత్రమే అడ్ హాక్ జడ్జిలను నియమించాలని వివరించింది. ఇటువంటి సందర్భాల్లో మాత్రమే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. 


మన దేశంలోని హైకోర్టుల్లో 1,080 మంది న్యాయమూర్తులు పని చేయవలసి ఉంది. ప్రస్తుతం 669 మంది న్యాయమూర్తులు మాత్రమే హైకోర్టుల్లో ఉన్నారు. అంటే 411 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయన్నమాట.


లోక్ ప్రహరి అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ శరద్ ఏ బాబ్డే, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. రెగ్యులర్ రికమెండేషన్స్‌కు బదులుగా అడ్ హాక్ (అవసరం నిమిత్తం) జడ్జీలను నియమించరాదని తెలిపింది. ఈ విషయంలో హైకోర్టులు అనుసరించవలసిన మార్గదర్శకాలను రూపొందిస్తామని పేర్కొంది. 


సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన హైకోర్టులో అన్ని ఖాళీల భర్తీ కోసం సిఫారసు చేయనిపక్షంలో అడ్ హాక్ జడ్జిల నియామకం కోసం ప్రయత్నాలు జరగకూడదన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, అడ్ హాక్ జడ్జిల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియంకు కూడా సమాచారం ఇవ్వాలని తాము అందుకే కోరుతున్నామని చెప్పారు. అడ్ హాక్ జడ్జీల నియామకాలు ఎటువంటి పరిస్థితుల్లో చేపట్టాలి? అనుసరించవలసిన విధానం ఏమిటి? ఎంత కాలం పని చేయించాలి? వారికి చెల్లించవలసిన వేతనం ఎంత? అనే విషయాలను సుప్రీంకోర్టు వివరిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పెండింగ్ కేసుల పరిష్కారం కోసం అడ్ హాక్ జడ్జిల నియామకాలు జరగాలన్నారు. 


Updated Date - 2021-04-08T21:16:42+05:30 IST