ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలపై విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-07T17:58:41+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సమయంలో

ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలపై విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సమయంలో భద్రతా లోపాలపై దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ ప్రారంభించింది. ఈ సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని పిటిషనర్  కోరారు. 


ఈ పిటిషన్‌ను లాయర్స్ వాయిస్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) దాఖలు చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. ఇది శాంతిభద్రతల సమస్య కాదని, ఇది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించిన విషయం కాదన్నారు. ఎస్‌పీజీ చట్టంలోని సెక్షన్ 14ను పరిశీలించాలని కోరారు. ఎస్‌పీజీ సభ్యుని సూచనలకు అనుగుణంగా సహాయపడవలసిన కర్తవ్యం కేంద్రం, రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం, స్థానిక అధికారులకు ఉందని చెప్పారు. ఓ అవినీతి కేసులో ఓ మాజీ ప్రధాన మంత్రిపై విచారణ సందర్భంలో ఎస్‌పీజీకి సహాయపడవలసిన కర్తవ్యం, విధి గురించి గతంలో సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చిందన్నారు. ప్రధాన మంత్రి భద్రతను ఉపసంహరించకూడదని, తనకు భద్రతను ఉపసంహరించాలని ప్రధాన మంత్రి కోరినప్పటికీ, ఆ విధంగా భద్రతను ఉపసంహరించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని వివరించారు. 


ఎస్‌పీజీ చట్టం ప్రకారం ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదని, శాంతిభద్రతల అంశం కాదని, ప్రధాన మంత్రికి రక్షణ కల్పించడమనేది దేశ భద్రతకు సంబంధించిన విషయమని, ఇది పార్లమెంటు పరిధిలోకి వస్తుందని తెలిపారు. ప్రధాన మంత్రి పంజాబ్‌లో పర్యటించినపుడు అనుమతించదగని చోట ఆయన వాహన శ్రేణిని నిలిపేశారని, ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన అని తెలిపారు. ఇలా జరగకూడదన్నారు. 


ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయకూడదన్నారు. జరిగిన ఉల్లంఘన స్పష్టంగా ప్రజల ముందు ఉందని తెలిపారు. దీనిపై ప్రొఫెషనల్‌గా దర్యాప్తు జరగాలన్నారు. పంజాబ్ ప్రభుత్వం దీనిపై విచారణ జరపకూడదన్నారు. ఈ పిటిషన్‌ను గురువారం దాఖలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించిన విషయాన్ని గమనించాలని సుప్రీంకోర్టును కోరారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్‌లోని భటిండా నుంచి ఫిరోజ్‌పూర్, హుస్సేనీవాలా వెళ్ళారని, దానికి సంబంధించిన అన్ని రికార్డులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సహకారంతో జిల్లా మేజిస్ట్రేట్ స్వాధీనం చేసుకోవాలని కోరారు. తప్పనిసరిగా సాక్ష్యాధారాలను పరిరక్షిస్తూ దర్యాప్తు జరగాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలకు అతీతంగా ఈ దర్యాప్తు జరగాలని తెలిపారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరిపించాలని కోరారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్‌లో పర్యటించినపుడు బయటపడిన భద్రతా లోపంపై పంజాబ్ పోలీసులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేశారు. ఫిరోజ్‌పూర్‌లోని ఓ ఫ్లైఓవర్ వద్దకు మోదీ కాన్వాయ్ చేరుకున్న సమయంలో కొందరు నిరసనకారులు రోడ్లను దిగ్బంధించడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని, వెనుదిరిగిన విషయం తెలిసిందే. 



Updated Date - 2022-01-07T17:58:41+05:30 IST