ఇటలీ పరిహారం చెల్లించాల్సిందే.. అప్పుడే కేసు మూసివేత!

ABN , First Publish Date - 2020-08-08T13:28:30+05:30 IST

కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను 2012లో ఇద్దరు ఇటాలియన్‌ మెరైన్స్‌ కాల్చి చంపిన కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇటలీ పరిహారం చెల్లించాల్సిందే.. అప్పుడే  కేసు మూసివేత!

అప్పుడే మెరైన్స్‌ కేసు మూసివేత

సుప్రీం కోర్టు స్పష్టీకరణ 

న్యూఢిల్లీ, ఆగస్టు 7: కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను 2012లో ఇద్దరు ఇటాలియన్‌ మెరైన్స్‌ కాల్చి చంపిన కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితుల కుటుంబాలకు ఇటలీ నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఈ కేసు మూసివేతకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘ఇటలీని నష్టపరిహారం చెల్లించనివ్వండి. అప్పుడే ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణకు అనుమతిస్తాం’’ అని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే పేర్కొన్నారు. యూఎన్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయం నేపథ్యంలో కేసుల ఉపసంహరణకు అనుమతివ్వాలని సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. అప్పటి ఘటనకు కారణమైన మెరైన్లను విచారించనున్నట్టు ఇటలీ హామీ ఇచ్చినట్టు పేర్కొంది. అయితే బాధిత మత్స్సకారుల కుటుంబాలకు ముందు పరిహారం ఇవ్వాలని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు.


చెక్కులు, బాధితుల కుటుంబ సభ్యులను కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఈ కేసులో చేర్చుతూ వారం రోజుల్లో దరఖాస్తు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు. కేసులను ఉపసంహరించుకునేందుకు అనుమతిచ్చే ముందు బాధితుల కుటుంబాల వాదనలను వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ.. ఇద్దరు మెరైన్లను విచారించడమేకాకుండా బాధితుల కుటుంబాలకు గరిష్ఠ నష్టపరిహారం చెల్లించనున్నట్టు ఇటలీ హామీ ఇచ్చిందని తెలిపారు. 

Updated Date - 2020-08-08T13:28:30+05:30 IST