హిజాబ్ వివాదంపై సరైన సమయంలో విచారణ : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-02-11T19:12:53+05:30 IST

విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలను ధరించరాదని

హిజాబ్ వివాదంపై సరైన సమయంలో విచారణ : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలను ధరించరాదని విద్యార్థినీ, విద్యార్థులను కర్ణాటక హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సరైన సమయంలో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. దేశంలోని ప్రతి పౌరుని ప్రాథమిక హక్కులను కాపాడతామని భరోసా ఇచ్చింది. కర్ణాటకలో, హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్లు తెలిపింది. 


కర్ణాటకలోని ఉడుపిలో ఓ పాఠశాలలో కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి, తరగతులకు హాజరుకావడంపై ఆ పాఠశాల యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మొదలైన వివాదం హైకోర్టును చేరింది. వీటిపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపితే బాగుంటుందని చెప్తూ, సింగిల్ బెంచ్ ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వీటిపై గురువారం విచారణ జరిపి తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థినీ, విద్యార్థులు తరగతులకు హాజరుకావాలని, మతపరమైన వస్త్రాలను ధరించవద్దని, తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది. 


ఈ తాత్కాలిక ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని పరిశీలించి, సరైన సమయంలో విచారణ జరుపుతామని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలోనూ, హైకోర్టులోనూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని చెప్పింది. 


పిటిషనర్ తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ దేవ్‌దత్ కామత్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని అధికరణ 25 ప్రకారం మతాచారాలను పాటించే ప్రాథమిక హక్కు ఉందని, ఈ హక్కును హైకోర్టు ఆదేశాలు సస్పెండ్ చేస్తున్నాయని వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, తాను ప్రతి పౌరుని ప్రాథమిక హక్కులను కాపాడతానని చెప్పింది. ఈ పిటిషన్‌పై సరైన సమయంలో విచారణ జరుపుతామని తెలిపింది. 


దీనిపై అత్యవసర విచారణ జరపాలని కామత్ కోరినపుడు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ, పరిశీలిస్తామన్నారు. 


Updated Date - 2022-02-11T19:12:53+05:30 IST