NEET-PG 2021: మెడికల్ సీట్ల వివాదంపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-06-09T20:29:39+05:30 IST

మెడికల్ సీట్ల వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మెడికల్ సీట్ల విషయంలో ధర్మాసనం శుక్రవారం (10-06-2022) తీర్పు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై..

NEET-PG 2021: మెడికల్ సీట్ల వివాదంపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు ఎప్పుడంటే..

న్యూఢిల్లీ: మెడికల్ సీట్ల వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మెడికల్ సీట్ల విషయంలో ధర్మాసనం శుక్రవారం (10-06-2022) తీర్పు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సుప్రీం మండిపడింది. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. మిగిలిన మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌పై రేపు సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేయనుంది. నీట్‌-పీజీ-2021లో 1,456 సీట్లను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇన్ని సీట్లు ఖాళీగా ఎందుకు ఉండాల్సి వచ్చిందని నిలదీసింది. ఇలా చేయడం ఆశావహ వైద్య విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, దేశంలో వైద్యుల కొరతను మరింత పెంచడంతోపాటు, అవినీతిని సైతం ప్రోత్సహించడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) వ్యవహరించిన తీరుపై నిప్పులు చెరిగింది. నీట్‌ పీజీ-21లో సీట్ల ఖాళీలపై దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు వేకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.



పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఒక్క సీటు భర్తీ కావాల్సి ఉన్నా దానిని ఖాళీగా ఉంచేందుకు వీల్లేదు. సీట్లను ఖాళీ ఉండకుండా చూడాల్సిన బాధ్యత మెడికల్‌ కౌన్సిల్‌దే. కానీ, ప్రతి కౌన్సెలింగ్‌ తర్వాత ఇదే సమస్య ఉత్పన్నమైంది. వ్యవస్థను ఎందుకు క్రమబద్ధీకరించడం లేదు? దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు.. సీట్లను ఇలా ఖాళీగా ఉంచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఆశావహ  వైద్య విద్యార్థుల సమస్యేకాదు.. వైద్యుల కొరతకు, అవినీతిని ప్రోత్సహించేందుకు కూడా దారితీస్తుంది’’ అని వ్యాఖ్యానించింది. కౌన్సెలింగ్‌ మధ్యలోనే ఖాళీగా ఉన్న సీట్ల భర్తీపై ఎందుకు దృష్టి సారించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేసింది.


కటాఫ్‌ డేట్‌ సమయానికి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో.. ఎన్ని అడ్మిషన్లు కల్పించారో లెక్కాపత్రం ఉండాలని సూచించింది. విద్యార్థులకు అడ్మిషన్‌ ఇవ్వని పక్షంలో అందుకు బాధ్యులైన వారి నుంచి పరిహారం ఇచ్చేలా తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అడ్మిషన్ల వ్యవహారానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసె్‌సను గురువారం కోర్టుకు రావాలని, విషయం తేలుస్తామని పేర్కొంది. కౌన్సెలింగ్‌కు సంబంధించి కొన్ని నిబంధనలు, బాధ్యతలను తామే నిర్ణయిస్తామని వ్యాఖ్యానించింది. ‘‘ఆఖరుకు 99 మార్కులు తెచ్చుకున్న వారికీ అడ్మిషన్‌ ఇవ్వలేని సమస్య వచ్చింది. ఇది వారి సమస్యే కాదు.. ‘సూపర్‌ స్పెషాలిటీ’ సమస్య. విద్యార్థుల పరిస్థితి మీకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు’’ అని బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2022-06-09T20:29:39+05:30 IST