Election Commissionకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2021-05-06T18:44:58+05:30 IST

మీడియాను కట్టడి చేయాలని ప్రయత్నించిన ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి సుప్రీంకోర్టులో

Election Commissionకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ : మీడియాను కట్టడి చేయాలని ప్రయత్నించిన ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించవద్దని ఆదేశించాలని ఈసీ చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశంలో కోవిడ్ కేసులు పెరగడానికి ఈసీదే భద్యతని మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించేందుకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. మీడియాను నియంత్రించడం తిరోగమన చర్య అవుతుందని స్పష్టం చేసింది. 


మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 26న ఓ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరగడానికి కారణం ఎన్నికల కమిషనేనని పేర్కొంది. అత్యంత బాధ్యతారహితమైన సంస్థగా అభివర్ణించింది. ఎన్నికల కమిషన్ అధికారులు హత్యలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ, విచారణ జరపాలని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ అపీలు చేసింది. 


జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈసీ అపీలుపై విచారణ జరిపింది. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా పరుషంగా ఉన్నాయని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు జ్యుడిషియల్ ఆర్డర్‌లో లేవని, అందువల్ల వాటిని తొలగించబోమని చెప్పింది. కోర్టు వ్యవహారాలను ప్రచురించే హక్కు మీడియాకు ఉందని తెలిపింది. సరైన ఆలోచన లేకుండా చేసే వ్యాఖ్యలు అపార్థాలకు దారి తీస్తాయని పేర్కొంది. 


ఈ ధర్మాసనంలోని మరొక న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా మాట్లాడుతూ, విచారణల సమయంలో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించరాదని తెలిపారు. వ్యాఖ్యలు చేయకుండా హైకోర్టులను, వ్యాఖ్యలను రిపోర్టింగ్ చేయకుండా మీడియాను నియంత్రించడం తిరోగమన చర్య అవుతుందని పేర్కొంది. 


Updated Date - 2021-05-06T18:44:58+05:30 IST