జహంగీర్‌పురి ఆక్రమణల కూల్చివేతలను 2 వారాలు ఆపండి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-04-21T18:12:13+05:30 IST

దేశ రాజధాని నగరంలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ

జహంగీర్‌పురి ఆక్రమణల కూల్చివేతలను 2 వారాలు ఆపండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణల తొలగింపును తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆపాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. బుధవారం జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలను ఉత్తర ఢిల్లీ నగరపాలక సంస్థ మేయర్‌కు తెలియజేసినప్పటికీ, కూల్చివేత చర్యలను ఆపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 


చట్ట విరుద్ధ ఆక్రమణలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ జమియత్ ఉలేమా-ఈ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, భవన నిర్మాణ వస్తువులు, స్టాల్స్, బడ్డీలు, కుర్చీలు, బల్లలు వంటివాటిని తొలగించేందుకు ముందుగా నోటీసులు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. ఈ పిటిషన్‌ను ఓ సంస్థ దాఖలు చేసిందని, వ్యక్తులు వచ్చి తమకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదని చెప్పాలని అన్నారు. ప్రభుత్వం ముందస్తు నోటీసులను ఇచ్చిందని చెప్పారు. 


ధర్మాసనం స్పందిస్తూ బుధవారం తాను ఇచ్చిన ఆదేశాలను మేయర్‌కు తెలియజేసిన తర్వాత జరిగిన కూల్చివేతలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. వ్యక్తులు వ్యక్తిగతంగా అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరింది. ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించాలని, తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరుగుతుందని తెలిపింది. 


తుషార్ మెహతా అంతకుముందు వాదనలు వినిపిస్తూ, జహంగీర్‌పురిలో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించడం కొత్త విషయం కాదని, ఈ ఏడాదిలో ఇది ఐదోసారి అని చెప్పారు. ప్రస్తుతం సంఘాలు జోక్యం చేసుకున్నాయన్నారు. కొన్ని కేసుల్లో నోటీసులు అక్కర్లేదని, అవసరమైన కేసుల్లో నోటీసులు ఇచ్చామని తెలిపారు. 


Updated Date - 2022-04-21T18:12:13+05:30 IST