Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 03:25AM

భార్య ఆభరణాలు అత్తవారి అధీనంలో ఉండడం ‘వేధింపుల’ కిందకు రాదు : సుప్రీం

న్యూఢిల్లీ, జనవరి 14 : భార్యకు సంబంధించిన ఆభరణాలను అత్తవారింటివారు తమ అధీనంలో ఉంచుకోవడం వరకట్నవేధింపుల వ్యతిరేక చట్టం-498ఏ కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. చట్టంలో పేర్కొన్న ‘హింస’ క్లాజుకు దీనితో సంబంధంలేదని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌  జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం పేర్కొంది. పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భద్రత పేరుతో తన ఆభరణాలను అత్తింటివారు తమ వద్ద ఉంచుకున్నారని, ఇది వరకట్న వేధింపుల వ్యతిరేకచట్టం-498ఏలో  పేర్కొన్న  ‘హింస’ కిందకు వస్తుందని బాధితురాలు పంజాబ్‌, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే అమెరికాలో  ఉద్యోగం  చేస్తున్నందున దేశం విడిచివెళ్లేందుకు తనకు అనుమతివ్వాలన్న భర్త అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అత్తవారి కుటుంబసభ్యులపై పెట్టిన వరకట్న వేధింపుల కేసులో  భర్త కూడా నిందితుడు అయినందువల్ల ఆయన అమెరికాకు వెళ్లకూడదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. అత్తా, బావమరుదులు తీసుకున్న బంగారానికి సంబంధించిన వివరాలను వధువు చెప్పలేదని పేర్కొంటూ.. ఈ విషయంలో అత్తింటివారు ‘హింసించారు’ అని చెప్పడానికి ఆస్కారంలేదని అభిప్రాయపడింది. 

   

‘భార్య అనుమతిలేకుండా ఫోన్‌ సంభాషణల రికార్డు’ కేసును పునఃసమీక్షిస్తాం

కాగా, భార్య అనుమతి లేకుండా జరిపే టెలిఫోన్‌ సంభాషణను భర్త రికార్డు చేయడం ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అంటూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును పునః సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బి.వి. నాగరతనతో కూడిన ధర్మాసనం పంజాబ్‌-హైకోర్టుకు నోటీసులు జారీచేసింది. కాగా,  విడాకుల కేసు విచారణలో భాగంగా..  భార్యతో జరిపిన ఫోన్‌ సంభాషణలను రికార్డు చేసిన భర్త బఠిండా ఫ్యామిలీ కోర్టుకు సమర్పించారు. ఫ్యామిలీ కోర్టు దానిని విచారణ సందర్భంగా స్వీకరించడాన్ని సవాల్‌ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించారు. భార్యకు తెలియకుండా టెలిఫోన్‌ సంభాషణను రికార్డు చేయడం ఆమెకు గల గోప్యత హక్కును ఉల్లంఘించడమేనంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. తాజాగా దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఒకరు ఆశ్రయించడంతో  హైకోర్టు తీర్పును తిరిగి విచారణ జరిపేందుకు దర్మాసనం అంగీకరించింది.

Advertisement
Advertisement