జడ్జీలపై తప్పుడు ఫిర్యాదులు సాధారణమైపోయింది

ABN , First Publish Date - 2020-09-06T14:21:31+05:30 IST

జడ్జీలపై తప్పుడు ఫిర్యాదులు చేయడం సర్వసాధారణమైపోయిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే అన్నారు.

జడ్జీలపై తప్పుడు ఫిర్యాదులు సాధారణమైపోయింది

పైకోర్టులకు పదోన్నతి వస్తుందంటే చాలు.. పాత ఫిర్యాదులు తిరగదోడుతున్నారు

సీజే శరత్‌ అరవింద్‌ బోబ్డే ఆక్షేపణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జడ్జీలపై తప్పుడు ఫిర్యాదులు చేయడం సర్వసాధారణమైపోయిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే అన్నారు. ‘మన వ్యవస్థలో నెలకొన్న ఈ దుర్లక్షణాన్ని మేం ఎరుగుదుం. ప్రతీరోజూ ఇది జరుగుతోంది. ఒక కిందిస్థాయి జడ్జి హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా లేదా సీజేగా నియమితులవుతారని తెలిస్తే చాలు... ఇక అతనిపై ఎప్పటివో పాత ఫిర్యాదులు తవ్వితీస్తున్నారు. ఇరవయ్యేళ్ల కిందటి నాటివి కూడా గుర్తుకొచ్చేస్తాయి. ఆ పదోన్నతిని అడ్డుకోవడమే ఽవారి లక్ష్యం’’ అని ఆయన నిశితంగా విమర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా జడ్జి దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై సీజే నేతృత్వంలోని బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. 1987లో  మధ్యప్రదేశ్‌ జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన సదరు జిల్లా జడ్జి- తాను హైకోర్టుకు పదోన్నతి పొందే వారి జాబితాలో ఉన్నట్లు తెలియగానే తనపై తప్పుడు ఫిర్యాదు మోపారని అంటూ సుప్రీంలో ఫిర్యాదు చేశారు. ‘నేను పదోన్నతి పొందుతానని తెలిసిన వెంటనే 2018లో నాపై లైంగిక వేధింపుల ఫిర్యాదు వచ్చింది. దీనికి సంబంధించిన ఆధారాలేవీ లేకపోయినా రెండేళ్లపాటు అక్కడి హైకోర్టు నా కేసును తేల్చకుండా రకరకాల విచారణలకు ఆదేశించింది. చివరకు జెండర్‌ సెన్సిటైజేషన్‌ కమిటీకి పంపింది. వారు ఐదునెలల పాటు దీన్ని పక్కనపెట్టింది. తన ఫిర్యాదును కొనసాగించే ఆసక్తి లేదని, విత్‌డ్రా చేసుకుంటానని ఫిర్యాదుచేసిన మహిళ చెప్పినా సదరు కమిటీ అందుకు తిరస్కరించింది. ఆ తరువాత పరిశీలించి చివరకు నా తప్పేంలేదని నిరుడు ఏప్రిల్‌లో ఓ నివేదిక ఇచ్చింది. ఫిర్యాదీదారు చేసిన ఆరోపణలకు తగిన ఆధారాల్లేవని తేల్చింది. సాక్ష్యాల్లేవని ఓ పక్క అంటూనే నా పై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది’’ అని ఆ జడ్జి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఇది న్యాయాన్ని అధిక్షేపించడమే. తగిన ఆధారాలు లేవని తెలిసినా విచారణలతో రెండేళ్లపాటు సాగదీసి, సాక్ష్యాలు చూపలేనని ఫిర్యాదీదారు చెప్పినా పట్టించుకోకుండా విషయాన్ని నాన్చడం న్యాయాన్ని వెక్కిరించడమే’ అని ఆ జడ్జి సుప్రీం బెంచ్‌కు నివేదించారు. దీన్ని పరిశీలించాక సీజే బోబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయనకు ముందు సీజేగా పనిచేసిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, దాని పరిశీలనకు జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోనే అంతర్గత కమిటీ ఏర్పడడం, చివరకు ఆ కమిటీ గొగోయ్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వడం తెలిసిందే.

Updated Date - 2020-09-06T14:21:31+05:30 IST