పీఎం పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీంకోర్టు విచారణ

ABN , First Publish Date - 2022-01-06T19:11:50+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం

పీఎం పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీంకోర్టు విచారణ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తీవ్రమైన, ఉద్దేశపూర్వక భద్రతా లోపానికి పాల్పడటంపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం నిరసనకారుల సెగ తగలడంతో మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 


పీఎం పర్యటనలో భద్రతా లోపంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ పిల్ దాఖలు చేసింది. దీనిపై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. సుప్రీంకోర్టులోని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాదికి ఈ పిల్ కాపీని అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారం జరుగుతుందని తెలిపింది. 


సీనియర్ అడ్వకేట్ మణిందర్ సింగ్ ఈ పిల్‌ను జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి నివేదించారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ‘‘పంజాబ్‌లో నిన్న ప్రధాన మంత్రి భద్రత తీవ్ర ఉల్లంఘనకు గురైన సంఘటనకు సంబంధించిన అత్యవసర విషయాన్ని ప్రస్తావిస్తున్నాను’’ అని మణిందర్ తెలిపారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కొహ్లీ ఉన్నారు. 


జస్టిస్ రమణ మాట్లాడుతూ, ‘‘మేం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు?’’ అని అడిగారు. దీనిపై మణిందర్ సింగ్ స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్‌లో బుధవారం పర్యటించారని చెప్పారు. ఈ సందర్భంగా భద్రతా లోపం జరిగిందని, ఇటువంటిదానిని మరోసారి జరగకుండా చూడాలని చెప్పారు. జరిగిన తప్పిదానికి బాధ్యులను గుర్తించాలన్నారు. భద్రతా ఏర్పాట్లపై వృత్తి నైపుణ్యంతో సమగ్ర దర్యాప్తు అవసరమని చెప్పారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో భటిండా జిల్లా జడ్జి ఈ పర్యటనకు సంబంధించిన పోలీసు బందోబస్తును పూర్తిగా పరిశీలించాలని కోరారు. ఈ పర్యటనకు పంజాబ్ పోలీసుల మోహరింపు, కదలికలకు సంబంధించిన అన్ని రికార్డులను భటిండా జిల్లా జడ్జి స్వాధీనం చేసుకుని, సుప్రీంకోర్టుకు సమర్పించాలన్నారు. ఆ రికార్డులను జిల్లా జడ్జి సుప్రీంకోర్టుకు సమర్పించిన తర్వాత, ఎటువంటి చర్యలు తీసుకోవాలో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించాలని కోరారు. ఈ రోజే (గురువారమే) దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేయడంపై పరిశీలించాలని కోరారు. 


సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, ఈ పిటిషన్ నకలును పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని, తదుపరి విచారణ శుక్రవారం జరుగుతుందని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఈ పిల్‌లో పార్టీలుగా పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-06T19:11:50+05:30 IST