ఎట్టకేలకు బెయిల్!

ABN , First Publish Date - 2022-08-12T09:33:40+05:30 IST

భీమా కోరేగావ్ కేసులో ఎట్టకేలకు కవి వరవరరావుకు బుధవారం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది.

ఎట్టకేలకు బెయిల్!

భీమా కోరేగావ్ కేసులో ఎట్టకేలకు కవి వరవరరావుకు బుధవారం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. ఏడాదిన్నరగా బెయిల్ విషయంలో కొనసాగుతూ వచ్చిన అనిశ్చితికి తెరదించుతూ, ఆరోగ్యకారణాల రీత్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, గతంలో బొంబాయి హైకోర్టు విధించిన కాల పరిమితిని కూడా తొలగిస్తూ జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధులియాల బెంచి తీర్పు ఇచ్చింది. బెయిల్ తో పాటు కాలపరిమితిని కూడా ఎత్తివేసినప్పటికీ, బీమా కోరేగావ్ కేసు నడుస్తున్న కోర్టు పరిధి, ముంబై నగర పరిధిని వీడి ఆయన బయటకు పోకూడదన్న గతకాలపు ఆంక్షను మాత్రం కొనసాగించింది. 


బెయిల్ దక్కిన విషయాన్ని అటుంచితే, విచారణ సందర్భంగా న్యాయమూర్తులు వేసిన ప్రశ్నలు, బెయిల్ ను అడ్డుకోవడం కోసం అడిషనల్ సాలిసిటర్ జనరల్ వి.ఎస్. రాజు చేసిన విభిన్నమైన ఆరోపణలు, వాదనలు ఆసక్తికరమైనవి. ఈ కేసులో పిటిషనర్ కు విధించగల శిక్ష ఏమిటని న్యాయమూర్తులు ప్రశ్నించినప్పుడు రాజు చెప్పిన సమాధానం మరణశిక్ష అని. ఎనిమిదిపదులు నిండిన వివిని ఓ భయంకరమైన నేరస్థుడిగా న్యాయస్థానం దృష్టికి తెచ్చేందుకు ఎన్ఐఎ న్యాయవాది ఎంతో ప్రయత్నించారు. వివి మీద గతంలో ఓ పాతిక కేసులున్నాయని చెబుతూ వాటినుంచి ఆయన నిర్దోషిగా బయటపడిన విషయాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా దాచారు. ఎంత ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది అయినా ఇలా న్యాయస్థానాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించడమేమిటో అర్థంకాదు. కేసు విచారణ ఎన్నాళ్ళలో పూర్తవుతుందన్న ప్రశ్నకు ఆయన దగ్గర సరైన సమాధానం లేనందువల్ల, నిందితులు పిటిషన్లమీద మీద పిటిషన్లు వేస్తూ విచారణకు అడ్డంపడుతున్నారని ఆరోపించారు. విచారణ ఏ దశలో ఉంది, ఎంతమంది సాక్షులను ఇప్పటివరకూ విచారించారు, ఇంకా ఎంతమందిని విచారించాల్సి ఉంది వంటి ప్రశ్నలు న్యాయమూర్తులు వరుసగా సంధించినప్పుడు ఎన్ఐఎ న్యాయవాది మాట మార్చడం తప్ప నేరుగా సమాధానం చెప్పలేని స్థితి. ఇంకా ఆరోపణలు కూడా ఎందుకు ఫ్రేమ్ చేయలేదు, కేసుకు ఒక తార్కికమైన ముగింపు ఎప్పటికి ఆశించవచ్చు? వంటి ప్రశ్నలు పలుమార్లు న్యాయమూర్తులనుంచి వినిపించాయి. 


ఈ కేసు ఏ దశలో ఉన్నదో న్యాయమూర్తులకు బాగానే అర్థమైనట్టు కనిపిస్తున్నది. ఆరోపణల, సాక్ష్యాధారాల ప్రతులను నిందితులకు ఇవ్వడం అనేది కేసు విచారణకు తొలిమెట్టు. ఆ పని ఇప్పటివరకూ జరగలేదు. వందలాదిమంది సాక్ష్యుల విచారణ జరగాల్సి ఉన్నందున, అది ప్రతిరోజూ సాగినా కేసు పూర్తికావడానికి పదేళ్ళుపడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ లెక్కగట్టారు. వరవరరావు ఆరోగ్యం అద్భుతంగా ఉన్నదని ఆయనకు బెయిల్ ఇవ్వనక్కరలేదని రాజు వాదించినప్పుడు, న్యాయమూర్తులు వేసిన ప్రశ్నలు సముచితమైనవి. ఆయన గతంలో బెయిల్ వచ్చిన ఆర్నెల్ల కాలంలో కానీ, ఆ తరువాత గడిచిన పన్నెండునెలల్లో కానీ ముంబై హైకోర్టు షరతులను ఉల్లంఘించారా?, పిటిషనర్ ను ఎన్ఐఎ ఇప్పటికైనా విచారించిందా? అన్న ప్రశ్నలకు రాజు లేదని చెప్పక తప్పలేదు. సుదీర్ఘకాలం అవకాశం ఉన్నా విచారించకుండా వదిలేసి, ఓ ఎనిమిది పదుల వృద్దుడు బెయిల్ అడుగుతున్నప్పుడు అడ్డుపడతారేమిటని న్యాయమూర్తులు అన్నప్పుడు, వయసు చూడకూడదనీ, వివి భయంకరమైన దేశవ్యతిరేక శక్తి అని ఎన్ఐఎ న్యాయవాది వాదించారు. 


చివరకు, బెయిల్ రాకుండా అడ్డుకోలేకపోవడంతో, బెయిల్ వచ్చినా వివిని ముంబైకి పరిమితం చేయడం, మిగతా నిందితులకు ఈ తీర్పు వర్తించదని పేర్కొనడం వంటివి మాత్రం ఎన్ఐఎ న్యాయవాది పట్టుబట్టి సాధించగలిగారు. స్వస్థలంలో కాకుండా ఈ వయసులో వివి ముంబై లోనే ఉండాలనడం ఇబ్బందికరమే. తత్సంబంధిత పిటిషన్ లిస్టయి, తమ ముందుకువచ్చినప్పుడు విచారిస్తామని న్యాయమూర్తులు హామీ ఇచ్చినందుకు సంతోషించాలి. బీమా కోరేగావ్ కేసులో 16మందిని అరెస్టు చేసి మూడేళ్ళు దాటింది. స్టాన్ స్వామి నిర్బంధంలోనే కన్నుమూశారు. వివి, సుధాభరధ్వాజ్ కు మాత్రం బెయిల్ లభించింది. నిందితులను విచారించకుండానే క్షోభకు, శిక్షకు గురిచెయ్యాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ కేసులో మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.

Updated Date - 2022-08-12T09:33:40+05:30 IST