చార్‌ధామ్ రోడ్ల విస్తరణకు సుప్రీంకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2021-12-14T20:06:20+05:30 IST

చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణకు సుప్రీంకోర్టు

చార్‌ధామ్ రోడ్ల విస్తరణకు సుప్రీంకోర్టు అనుమతి

న్యూఢిల్లీ : చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాంతంలో విశాలమైన రోడ్లు ఉండటం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదనే ప్రభుత్వ వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. దేశ భద్రతకు ఇటీవల ఎదురైన తీవ్రమైన సవాళ్ళ దృష్ట్యా సరిహద్దు భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, దళాల రాకపోకలు, ఆయుధాల రవాణా అవసరమని తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేకతగల వ్యవస్థ అని, తన కార్యకలాపాలకు అవసరమైనవేమిటో నిర్ణయించుకోగలదని పేర్కొంది. సరిహద్దులను కాపాడటానికి సాయుధ దళాల మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చవలసి ఉందని తెలిపింది. వ్యూహాత్మక ప్రాధాన్యంగల హైవేలను ఇతర కొండ ప్రాంతాల్లోని హైవేలతో సమానంగా పరిగణించరాదని తెలిపింది. 


ఈ విస్తరణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. నాలుగు నెలలకోసారి ఈ ప్రాజెక్టు ప్రగతిని తనకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ దేవాలయాలైన బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలను కలిపే మూడు వ్యూహాత్మక రోడ్లను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ రోడ్ల పొడవు సుమారు 889 కిలోమీటర్లు ఉంటుంది. 10 మీటర్ల వెడల్పయిన తారు రోడ్లను అన్ని కాలాలకు అనువైన రీతిలో నిర్మించాలని ప్రణాళికలు రచించింది. గతంలో 5.5 మీటర్ల వెడల్పయిన తారు రోడ్ల నిర్మాణానికి అనుమతి ఉంది. భారత్-చైనా సరిహద్దులకు వెళ్ళడానికి ఈ రోడ్లు ఉపయోగపడతాయి. 


5.5 మీటర్ల వెడల్పయిన తారు రోడ్డును నిర్మించాలని చెప్తున్న 2018నాటి సర్క్యులర్‌ను సవరించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన  జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. 


Updated Date - 2021-12-14T20:06:20+05:30 IST