NEET PG 2021: ఖాళీ సీట్ల భర్తీకి మరోసారి కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు నో

ABN , First Publish Date - 2022-06-10T20:00:08+05:30 IST

NEET PG 2021 ఆలిండియా కోటాలో ఖాళీ సీట్లను భర్తీ చేయడం

NEET PG 2021: ఖాళీ సీట్ల భర్తీకి మరోసారి కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు నో

న్యూఢిల్లీ : NEET PG 2021 ఆలిండియా కోటాలో ఖాళీ సీట్లను భర్తీ చేయడం కోసం ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఇప్పటికే 8-9 రౌండ్లు జరిగాయని, తాజాగా మరోసారి కౌన్సెలింగ్‌ను నిర్వహించరాదని తీసుకున్న నిర్ణయం నిరంకుశంగా తీసుకున్నది కాదని, వైద్య విద్య, ప్రజారోగ్యాల ప్రయోజనాల కోసమేనని వివరించింది. 


కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని స్పెషల్ స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించరాదని నిర్ణయించినపుడు, దానిని నిరంకుశ చర్యగా పరిగణించలేమని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం తెలిపింది. 


ఇదేమీ కొత్త విషయం కాదు

2022 మే 7న జరిగిన కౌన్సెలింగ్ అనంతరం దాదాపు 1,456 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దీనిపై జస్టిస్ షా మాట్లాడుతూ, ఖాళీ సీట్లు ఉండటం చాలా సంవత్సరాల నుంచి జరుగుతోందని, ఈ ఏడాది మాత్రమే అది కొత్త విషయం కాదని చెప్పారు. ప్రతి కసరత్తుకు ఓ పరిమితి ఉండాలన్నారు. పదో రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత కూడా సీట్లు ఖాళీగా ఉండిపోయే అవకాశం లేకపోలేదన్నారు. 


ప్రజల ఆరోగ్యానికి నష్టం

ఏడాదిన్నర తర్వాత హక్కులను విద్యార్థులు కోరకూడదని ధర్మాసనం చెప్పింది. ఏడాదిన్నర గడచిపోయిన తర్వాత ప్రవేశం కల్పించాలని, ప్రజారోగ్యానికి నష్టం కలిగించాలని చెప్పగలమా? అని ప్రశ్నించింది. 


రానున్న కౌన్సెలింగ్‌పై ప్రభావం

ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (DGHS) సమర్పించిన అఫిడవిట్‌లో, 2021 ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కోసం ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ క్లోజ్ అయిందని చెప్పారు. ఈ పీజీ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసినవారికి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇవ్వడం ప్రారంభమైందన్నారు. పిటిషనర్ చాలా ఆలస్యంగా విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న NEET-PG 2022 కౌన్సెలింగ్‌పై దీని ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. రెండు విద్యా సంవత్సరాలకు ఏకకాలంలో కౌన్సెలింగ్ నిర్వహించడం కష్టమవుతుందని చెప్పారు. 


ఆకలి వంటిదే విద్య

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఇది మూడేళ్ళ కోర్సు అని, విద్య విషయంలో రాజీ పడకూడదని చెప్పింది. ఉదాహరణకు, ఆరు నెలల నుంచి ఆకలితో ఉన్నవారు ఒక రోజులో అంతా తినేయగలరా? అని ప్రశ్నించింది. విద్య కూడా అటువంటిదేనని తెలిపింది. 


తొమ్మిది రౌండ్లు

నేషనల్ మెడికల్ కౌన్సిల్ తొమ్మిది రౌండ్ల నీట్-పీజీ 2021ను నిర్వహించింది. వీటిలో నాలుగు రౌండ్లు స్టేట్ కౌన్సెలింగ్, నాలుగు రౌండ్లు ఆలిండియా కోటా కౌన్సెలింగ్, ఒక రౌండ్ ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ఉన్నాయి. నీట్-పీజీ 2021 ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ముగిసింది. 1,456 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 


Updated Date - 2022-06-10T20:00:08+05:30 IST