బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2020-08-05T23:38:43+05:30 IST

కేరళ నన్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ : కేరళ నన్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు సుప్రీంకోర్టులో బుధవారం చుక్కెదురైంది. ఈ ఆరోపణల నుంచి తనకు విముక్తి కల్పించాలని చేసిన విజ్ఞప్తిని కేరళ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 


బిషప్ ఫ్రాంకో ములక్కల్  నేరం చేసినట్లు తెలిపే సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయని, బాధితురాలు రహస్యంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో నన్‌పై అత్యాచారం కేసులో ములక్కల్  విచారణను ఎదుర్కొనక తప్పదని హైకోర్టు జూలై 7న స్పష్టం చేసింది. 


అంతకుముందు బిషప్ ఫ్రాంకో ములక్కల్ అనేకసార్లు ట్రయల్ కోర్టుకు హాజరుకాలేదు. పదే పదే హెచ్చరించినప్పటికీ ఆయన కోర్టుకు గైర్హాజరవుతుండటంతో, ఆయనకు మంజూరైన బెయిలును రద్దు చేసి, నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 


2014 నుంచి 2016 మధ్య కాలంలో కేరళలోని కొట్టాయం జిల్లాలో మిషనరీస్ ఆఫ్ జీసస్‌కు చెందిన ఓ నన్‌పై ములక్కల్ పదే పదే అత్యాచారం చేసినట్లు ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ములక్కల్‌కు 2018లో బెయిలు మంజూరైంది. అంతకుముందు ఆయన 40 రోజులపాటు జైలులో గడిపారు.


Updated Date - 2020-08-05T23:38:43+05:30 IST