చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2020-06-05T01:57:44+05:30 IST

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో..

చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం బెయిలుకు వ్యతిరేకంగా సీబీఐ వేసిన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారంనాడు కొట్టివేసింది. ఓపెన్ కోర్టులో రివ్యూ పిటిషన్‌ను విచారించాలన్న సీబీఐ వాదనను తోసిపుచ్చుతున్నామని, రివ్యూ పిటిషన్‌తో పాటు, సంబంధిత పత్రాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాతే ఈ ఆదేశాలిచ్చామని న్యాయవాదులు తమ ఉత్తర్వులో పేర్కొన్నారు.


చిదంబరం దేశం విడిచి పారిపాయే అవకాశాలున్నాయంటూ సీబీఐ చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ గత అక్టోబర్‌ 22న ఆయనకు బెయిలు మంజూరు చేసింది. అనంతరం, ఇదే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనను కూడా గత డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఆయనకు బెయిలు మంజూరు చేసింది. దర్యాప్తులో చిదంబరం పాల్గొంటున్నారని కోర్టు పేర్కొంటూ, చిందబరం ఇక ముందు కూడా దర్యాప్తునకు సహకరించాలని, కేసు విషయంలో మీడియాతో మాట్లాడరాదని, విదేశీ ప్రయాణాలు చేయరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదన్న షరతులపె బెయిలు మంజూరు చేసింది.

Updated Date - 2020-06-05T01:57:44+05:30 IST