పీఎం భద్రతా లోపం : పంజాబ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2022-01-07T19:04:54+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్

పీఎం భద్రతా లోపం : పంజాబ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వద్ద భద్రతపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పీఎం పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. 


ప్రధాన మంత్రి మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అప్పగించింది. రిజిస్ట్రార్ జనరల్‌కు అవసరమైన సహకారాన్ని పంజాబ్ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ), ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. రిజిస్ట్రార్ జనరల్‌తో సమన్వయం కోసం చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారి ఒకరు నోడల్ ఆఫీసర్లుగా పని చేయాలని తెలిపింది. 


ఈ సంఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు తమ కార్యకలాపాలను సోమవారం (జనవరి 10) వరకు నిలిపేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను మౌఖికంగా జారీ చేసినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. లాయర్స్ వాయిస్ దాఖలు చేసిన పిల్‌పై తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్‌లో పర్యటించారు. కొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతోపాటు ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన వెళ్ళారు. అయితే హెలికాప్టర్‌లో ప్రయాణించేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకున్నారు. జాతీయ స్మారక కేంద్రంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళ్తుండగా, ఆ మార్గంలోని రోడ్డును కొందరు నిరసనకారులు దిగ్బంధించడంతో ఫిరోజ్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద ఆయన వాహన శ్రేణి నిలిచిపోవలసి వచ్చింది. దాదాపు 20 నిమిషాలపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని, తిరిగి భటిండా విమానాశ్రయానికి చేరుకున్నారు. 


ఈ సంఘటనపై లాయర్స్ వాయిస్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయ స్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది. 


Updated Date - 2022-01-07T19:04:54+05:30 IST