‘స్కిన్ టు స్కిన్’ తీర్పు ఇచ్చిన జడ్జికి సుప్రీంకోర్టు కొలీజియం ఝలక్

ABN , First Publish Date - 2021-12-17T19:51:59+05:30 IST

దాడిలో బాధితురాలు, నిందితుని మధ్య శారీరక సంబంధం

‘స్కిన్ టు స్కిన్’ తీర్పు ఇచ్చిన జడ్జికి సుప్రీంకోర్టు కొలీజియం ఝలక్

న్యూఢిల్లీ : దాడిలో బాధితురాలు, నిందితుని మధ్య శారీరక సంబంధం లేనపుడు, ఆ దాడిని పోక్సో చట్టం క్రింద లైంగిక దాడిగా పేర్కొనడం సాధ్యం కాదని తీర్పు చెప్పిన జడ్జికి శాశ్వత హోదా కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం నిరాకరించింది. ఈ మహిళా న్యాయమూర్తి ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన రెండు తీర్పులను అత్యున్నత న్యాయస్థానం నవంబరు 18న రద్దు చేసింది. 


బోంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనెడివాలా (మహిళ) పోక్సో (లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ) చట్టం ప్రకారం లైంగిక దాడి నిబంధనలను వివరించారు. ఓ మైనర్ బాలికను అనుచితంగా తడిమినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితునికి ఆమె బెయిలు మంజూరు చేశారు. బాధితురాలు, నిందితుని మధ్య శారీరక సంబంధం లేనందువల్ల ఈ దాడిని పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడిగా పేర్కొనజాలమని తెలిపారు. ఈ తీర్పుపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. చాలా మంది తీవ్రంగా విమర్శించారు. 


మరో కేసులో ఓ ఐదేళ్ల బాలిక చేతులను నిందితుడు పట్టుకోవడం, నిందితుడు తన ప్యాంటు జిప్‌ను ఓపెన్ చేయడం లైంగిక దాడి నిర్వచనం పరిధిలోకి రాదని జస్టిస్ పుష్ప తీర్పు చెప్పారు. ఆ నిందితుడిని దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేశారు. 


విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబరు 14న సమావేశమైంది. ఈ సమావేశంలో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ కూడా పాల్గొన్నారు. జస్టిస్ పుష్ప గనెడివాలాను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేయరాదని ఈ సమావేశం నిర్ణయించింది. ఇటువంటి కేసుల్లో ఆమెకు గతంలో అనుభవం లేనట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. అయితే బోంబే హైకోర్టు అదనపు జడ్జిలు ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు ప్రతిపాదనలను ఆమోదించింది. 


Updated Date - 2021-12-17T19:51:59+05:30 IST