అనంతపురం: ‘‘ఈనాటి నా పదవులు, గౌరవానికి సత్యసాయి ఆశీస్సులే కారణం’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవ వేడుకలలో ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 32 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ఎన్వీ రమణ మాట్లాడుతూ పతాకాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. విద్యార్థులపై సత్యసాయి వాత్సల్యానికి ప్రతీక ఈ వర్సిటీ అని అన్నారు. ఆధునిక గురుకులాలకు ఈ వర్సిటీ ఆదర్శ నామూనా అని తెలిపారు. విలువలతో కూడిన విద్య అందించే దిశగా వర్సిటీలు ఉండాలన్నారు. సత్యసాయి ప్రవచించిన ప్రేమను.. మనం సమాజానికి అందించాలని సూచించారు. నిస్వార్థ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరమన్నారు. వర్సిటీలో చేర్చుకున్న విద్యా విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలని తెలిపారు. అకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.