కేసుల విచారణకు సుప్రీంకోర్టు కొత్త విధానం ఈ నెల 15 నుంచి

ABN , First Publish Date - 2021-03-06T22:40:08+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలైన పరిమితుల నుంచి

కేసుల విచారణకు సుప్రీంకోర్టు కొత్త విధానం ఈ నెల 15 నుంచి

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలైన పరిమితుల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా హైబ్రిడ్ విచారణలను ప్రారంభించాలని నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో జరిగే విచారణలను ప్రత్యక్షంగానూ, వర్చువల్ విధానంలోనూ (హైబ్రిడ్ విధానంలో) నిర్వహించాలని నిర్ణయించింది. తుది విచారణలు/రెగ్యులర్ మ్యాటర్స్ విచారణలను ఈ విధానంలో విచారిస్తుంది. 


కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విచారణలు నిర్వహించేందుకు పాటించవలసిన మార్గదర్శకాలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే జారీ చేసినట్లు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ మార్చి 5న విడుదల చేసిన సర్క్యులర్ వెల్లడించింది. మంగళ, బుధ, గురువారాల్లో విచారణ కోసం లిస్ట్ అయిన తుది విచారణ/రెగ్యులర్ మ్యాటర్స్ విచారణలను ప్రయోగాత్మకంగా హైబ్రిడ్ (వర్చువల్, ప్రత్యక్ష) విధానంలో విచారించవచ్చునని ఈ సర్క్యులర్ పేర్కొంది. ఈ విచారణలు ధర్మాసనం నిర్ణయం మేరకు జరుగుతాయని తెలిపింది. ఏదైనా కేసులోని పార్టీల సంఖ్య, కోర్టు గదుల సామర్థ్యం వంటివాటిని దృష్టిలో ఉంచుకుని ఈ విధానంలో విచారించవలసిన కేసులపై ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. సోమ, శుక్రవారాల్లో విచారించేందుకు లిస్ట్ అయిన కేసులతో సహా మిగిలిన అన్ని కేసుల విచారణలు వీడియో/టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతాయని వివరించింది. 


20 మంది కన్నా ఎక్కువైతే...

ఏ సమయంలోనైనా కోర్టు గదిలో 20 కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఉండే అవకాశం ఉన్నట్లు ధర్మాసనం గుర్తిస్తే, సంబంధిత కేసుల తుది విచారణ/రెగ్యులర్ మ్యాటర్స్ విచారణలను వీడియో/టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారని తెలిపింది. 


కోర్టు గదిలోకి అనుమతి ఎవరికి?

హైబ్రిడ్ విధానంలో విచారణ జరిపేందుకు నిర్ణయించిన కేసులో పార్టీల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్)ను, వాదనలు వినిపించే న్యాయవాదిని కోర్టు గదిలోకి అనుమతిస్తారు. ఏఓఆర్ కోరుకుంటే పుస్తకాలు, జర్నల్స్ మోసుకెళ్ళేందుకు ఓ రిజిస్టర్డ్ క్లర్క్‌ను కోర్టు గది వరకు అనుమతిస్తారు. హైబ్రిడ్ విచారణ కోసం ఓ పార్టీకి చెందిన న్యాయవాదులంతా కోర్టు గదిలో భౌతికంగా హాజరుకావచ్చు లేదా వీడియో/టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుకావచ్చు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోనూ, కోర్టు గదుల్లోనూ తప్పనిసరిగా కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలి, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రపరచుకోవాలి, భౌతిక దూరం పాటించాలి. 


కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా అష్టదిగ్బంధనాన్ని విధించినప్పటి నుంచి సుప్రీంకోర్టులో విచారణలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-03-06T22:40:08+05:30 IST