రైతు నిరసనలతో రోడ్ల దిగ్బంధం: కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

ABN , First Publish Date - 2021-08-24T00:52:56+05:30 IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న నిరసనలతో రోడ్లు దిగ్బంధానికి గురవుతున్నారని, ఇందుకు ఒక పరిష్కారం కనుగొనాలని..

రైతు నిరసనలతో రోడ్ల దిగ్బంధం: కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న నిరసనలతో రోడ్లు దిగ్బంధానికి గురవుతున్నారని, ఇందుకు ఒక పరిష్కారం కనుగొనాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారంనాడు ఆదేశించింది. ప్రధానంగా పంజాబ్‌కు చెందిన రైతులతో పాటు హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది గత ఏడాది నవంబర్ నుంచి మూడు ఢిల్లీ సరిహద్దు పాయింట్లలో నిరసనలు సాగిస్తున్నారు. గత సెప్టెంబర్‌లో కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.


నొయిడా నివాసి ఒకరు రైతు నిరసనల కారణంగా తలెత్తిన రోడ్ల దిగ్బంధాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. దీనిపై సోమవారం విచారణ జరింగి. దీనికి పరిష్కారం కేంద్రం, రాష్ట్రం చేతుల్లో ఉందని, నిరసనలు కొనసాగుతూ పోతే ట్రాఫిక్‌  నియంత్రించలేమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల రాకపోకలకు అంతరాయం కలగరాదని బెంచ్ ప్రిసైడింగ్ జడ్జి ఎస్.కె.కౌల్ అన్నారు. ''మీరెందుకు పరిష్కారం కనుగొనలేకపోతున్నారు? వాళ్లకు నిరసనలు చేసే హక్కు ఉంది. కానీ, రాకపోకలకు అంతరాయం కలిగించకూడదు" అని జస్టిస్ ఎస్.కె.కౌల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను నిలదీశారు. తదుపరి విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.


రోడ్ల దిగ్బంధాలను ఏ విధంగా నియంత్రించవచ్చో అఫిడవిట్ దాఖలు చేయాలని గత జూలై 19న జరిగిన విచారణలో ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలను బెంచ్ ఆదేశించింది. నిరసనల్లో భాగంగా రోడ్ల దిగ్బంధం చట్టవిరుద్ధమంటూ రైతులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఉత్తరప్రదేశ్ సర్కార్ వివరణ ఇచ్చింది.

Updated Date - 2021-08-24T00:52:56+05:30 IST