ఆర్య సమాజ్‌లో ఒక్కటైన జంటలకు గుర్తింపు లేనట్టేనా ?

ABN , First Publish Date - 2022-06-04T00:39:33+05:30 IST

సంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ పెళ్లిళ్లకు నిలయం ‘ఆర్య సమాజ్’. తల్లిదండ్రులు నిరాకరించిన లక్షలాది కల్యాణాలకు సజీవ సాక్ష్యం ‘ఆర్య సమాజ్’.

ఆర్య సమాజ్‌లో ఒక్కటైన జంటలకు గుర్తింపు లేనట్టేనా ?

హైదరాబాద్ : సంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ పెళ్లిళ్లకు నిలయం ‘ఆర్య సమాజ్(Arya samaj)’. తల్లిదండ్రులు నిరాకరించిన లక్షలాది కల్యాణాలకు సజీవ సాక్ష్యం ‘ఆర్య సమాజ్’. కుల, మతాలను ఎదురించిన ఎన్నో జంటలను ఒక్కటి చేసిన ఈ వేదిక జారీ చేసే వివాహ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై సమాజంలో విశ్వసనీయత ఉంది. అందుకనే ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటల్లో అత్యధికులు ప్రభుత్వ కార్యాలయాల్లో పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అయితే తాజాగా సుప్రీంకోర్ట్(Supreme court) చేసిన వ్యాఖ్యలు ‘ఆర్య సమాజ్’ పెళ్లి సర్టిఫికెట్ చట్టబద్ధతను ప్రశ్నార్థకంగా మార్చివేశాయి.


వివాహాలు చెయ్యడం, మ్యారేజీ సర్టిఫికెట్ జారీ చేయడం ఆర్యసమాజ్ పనికాదని, అందుకు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని ఒక కేసులో వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్ట్ తేల్చిచెప్పింది. దీనర్థం ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పటివరకూ ఆర్యసమాజ్ చేసిన వివాహాలు, జారీ చేసిన మ్యారేజీ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని చెప్పినట్టయింది. నిజానికి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుని, అక్కడి నుంచి తెచ్చుకున్న వివాహధృవీకరణ పత్రం చట్టబద్ధమైనదనే భావంతో ఎన్నో జంటలు తమ పెళ్లిని ప్రభుత్వ కార్యాలయాల్లో రిజిష్టర్ చేయించుకోలేదు. పెళ్లికి ఆధారంగా ఆర్యసమాజ్ సర్టిఫికెట్‌నే చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు కాకపోతే గతంలో ఆర్యసమాజ్‌లో పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ జంటల వివాహ చట్టబద్ధత ఏమిటనే అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని ఏళ్లకేళ్ళు గడుస్తున్న జంటలకు వివాహ చట్టబద్ధత అవసరమైతే ఎలా? ఆ సర్టిఫికెట్‌ను తీసుకెళ్లి ఇప్పుడు రిజిష్ట్రర్ చేయించుకునే వీలుంటుందా? మళ్ళీ సంప్రదాయబద్ధంగా లేదా రిజిస్టర్ మ్యారేజి చేసుకోవాలా? అందుకు ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.


ఆర్యసమాజ్‌‌ అంటే ఆదర్శ వివాహాలకు నెలవు. కుల, మత, వర్గ అంతరాలను ఎదురించి.. తల్లిదండ్రులను కాదని పెళ్లి పీటలు ఎక్కిన జంటలు వేలకు వేలు ఉన్నాయి. సామాన్యులే కాకుండా సమాజంలో పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ వేదికలపై పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ వివాహ వ్యవస్థ దేశమంతటా దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్ట్ అనూహ్య వ్యాఖ్యలతో ఆర్యసమాజ్ వివాహాలపై ఎలాంటి ప్రభావం పడనుందనేది ఆసక్తికరంగా మారింది.


ఈ పరిణామంపై సామాన్యులు లేవనెత్తుతున్న అంశాలు ఇలా ఉన్నాయి. ఇళ్ళలోను, గుళ్ళలోను, మంటపాలలోను జరిగే హిందూ వివాహాలలో పురోహితులు వేద మంత్రాల నడుమ ఆయా వివాహాలు చేస్తారు. ఆర్య సమాజ్‌లో కూడా ఇదే రీతిలో అగ్నిసాక్షిగా, వేదమంత్రాలతో పెళ్ళి తంతు నిర్వహిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే, సంప్రదాయ వివాహాలకు అదనంగా వయసు ధృవీకరణ, నివాస ధృవీకరణ, సాక్షి సంతకాలు ఇవన్నీ తీసుకుని పకడ్బందీగానే నిర్వహిస్తారు. సాక్షుల ఆధార్, పాన్, వేలి ముద్రలు అన్నీ తీసుకుంటారు. ఇంత కఠిన నిబంధనలతో ఎన్నో ఏళ్ళుగా ఆర్యసమాజ్ నిర్వహిస్తున్న వివాహాలపై సుప్రీంకోర్టు ఇప్పుడు అభ్యంతరం ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న ప్రశ్న వారిలో తలెత్తింది. ఇతర మతాలవారి వివాహాలు కూడా ఏ విధంగా అయితే వారి ప్రార్థనా మందిరాలు, ఇళ్ళు, ఫంక్షన్ హాల్స్‌లో వారి మతాధిపతుల మధ్య వారి సంప్రదాయాల ప్రకారం జరుగుతూ వస్తున్నాయో ఆర్య సమాజ్‌లోనూ అలాగే వివాహాలు జరుగుతున్నప్పుడు, చట్టబద్దతపై అక్కడ లేని అభ్యంతరం ఆర్యసమాజ్ వివాహాల విషయంలో ఎందుకు వచ్చింది? ఇప్పుడేం చెయ్యాలంటూ లోతైన చర్చల్లోకి దిగారు.

Updated Date - 2022-06-04T00:39:33+05:30 IST