అమ్మగా ఆదరిస్తూ... అండగా ఉద్యమిస్తూ...

ABN , First Publish Date - 2022-03-10T05:30:00+05:30 IST

తల్లి ఒడిలో ఆడుకుంటూ గోరు ముద్దలు తినాల్సిన వయస్సులో కన్న

అమ్మగా ఆదరిస్తూ...  అండగా ఉద్యమిస్తూ...

తల్లి ఒడిలో ఆడుకుంటూ గోరు ముద్దలు తినాల్సిన వయస్సులో కన్న తండ్రే కర్కశంగా వదిలించుకున్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారి అనాథగా పెరిగింది. బాల్యమంతా కష్టాలు, అవమానాలు, వేధింపులను భరించిన ఆమె.. ఇప్పుడు అదే అనాథల కోసం పని చేస్తోంది. ఆమే సామినేని నీరజా రాణి. అనాథలను తల్లిదండ్రుల్లా అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యమిస్తోన్న ఆమె తన బాల్యం, జీవితంలో ఎదురయిన కష్టాలు, హక్కుల కోసం పోరాడుతున్న తీరును నవ్యతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..


‘‘అప్పుడు నా వయస్సు ఏడాదిన్నర. నన్ను గుంటూరులోని ఓ సినిమా థియేటర్‌ వద్దకు తీసుకెళ్లి.. చాక్లెట్‌, బిస్కెట్‌ కొనిచ్చిన మా నాన్న అక్కడే వదిలేసి వెళ్లాడు. సాయంత్రం వరకు ఏడుస్తూ కూర్చున్న నన్ను ఓ మహిళ గుర్తించి చుట్టు పక్కల అడిగింది. పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లినా నా వివరాలు కనుక్కోలేకపోయారు. నన్ను గుర్తించిన ఆమెనే  నన్ను తీసుకెళ్లి పెంచింది. ఆమె పేరు  సిస్టర్‌ మార్గరేట్‌. ఎంతో మంది అనాథలను చేరదీసిన ఆమె అప్పటికే.. గుంటూరులో ’ప్రేమ్‌ సేవా సదన్‌’ పేరుతో ఆశ్రమాన్ని నడుపుతున్నారు. నాతో పాటు నా తోటి పిల్లలంతా సిస్టర్‌ మార్గరేట్‌ను అమ్మా అని పిలిచేవాళ్లం. అలా ఆమె నాకు అమ్మ అయింది.


ఆ పిల్లలు, ఆమ్మే నాకు ప్రపంచం. అయితే నేను ఎవరు..? నా తల్లిదండ్రులు ఎవరు..? అనే ఆలోచనలు నన్ను తొలిచేవి. ఆశ్రమంలో ఉన్న నా తోటి పిల్లలందరికీ ఎవరో ఒక బంధువు ఉండేవారు.  నా కోసం ఎవరూ రాకపోవటం, ఎవరూ లేకపోటంతో చాలా సార్లు ఏడ్చేదాన్ని. స్కూల్‌లో పేరు రాయాల్సి వచ్చినప్పుడు అమ్మే నాకు సామినేని నీరజారాణి అని పేరు పెట్టింది. ఆ తరువాత ఆశ్రమాన్ని నగరంలోని హయత్‌నగర్‌ దగ్గర తొర్రూర్‌కు మార్చారు. అలా  అమ్మ దగ్గరే ఉంటూ పదో తరగతి వరకు చదువుకున్నాను.. కానీ ఆర్థిక ఇబ్బందులు రావటం. అనారోగ్యంతో.. అమ్మ ఆశ్రమాన్ని 2004లో మూసేసింది.  


బస్టాండే షెల్టర్‌...

ఆశ్రమాన్ని మూసేయటంతో.. మిగతా పిల్లలందరూ వారి వారి బంధువుల ఇళ్లకు వెళ్లారు. కానీ నాకు ఎవరూ లేరు. రెండు మూడు రోజులు  స్నేహితుల ఇళ్లల్లో తలదాచుకున్నా. ఆ తరువాత బయటికి వచ్చాను. ఎక్కడ ఉండాలో తెలియదు. నాకు ఉన్న రెండు జతల బట్టలు,  చేతిలో రూ.150 నగదు, సర్టిఫికెట్లతో దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టా్‌పకు చేరుకున్నా. ఆ రోజు యాచకులే తినడానికి ఆహారం ఇచ్చారు. పక్కనే సులభ్‌ కాంప్లెక్స్‌లో ఉండే ఒక అంకుల్‌ నన్ను గమనించి ధైర్యం చెప్పాడు. కొన్ని రోజుల పాటు ఆ సులబ్‌ కాంప్లెక్స్‌లోనే స్నానం చేయటం, బట్టలు ఉతుక్కోవడం, బస్టా్‌పలో పడుకోవటం చేశా.



వంశీ పరిచయంతో...

 ఒక రోజు పేపర్‌లో ప్రకటన చూసి.. ఓ కాల్‌ సెంటర్‌ ఆఫీ్‌సకు ఉద్యోగం కోసం వెళ్లా. రూ.2వేల జీతం ఇస్తామని యజమాని ఒప్పుకున్నాడు. కానీ ఆ యజమాని నన్ను ఆఫీ్‌సలోనే ఉండాలని, నేను అన్ని విధాల చూసుకుంటానంటూ ఒత్తిడి చేయసాగాడు. శారీరక వాంఛ తీర్చుకోవాలన్న కోరికతో బెదింపులకు కూడా పాల్పడ్డాడు. దాంతో ఉద్యోగం మానేశా. తరువాత ఎల్‌బీనగర్‌లోని ఓ స్కూల్‌లో సాయంత్రం ట్యూషన్‌ చెప్పా. నెలకు రూ.2వేలు ఇచ్చేవారు. అదే సమయంలో మల్టీమీడియా  నేర్చుకోవటానికి ఓ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లాను. అక్కడే వంశీ పరిచయం అయ్యాడు. అతని మనస్తత్వం నచ్చి పెళ్లి చేసుకున్నా.


ఆ తరువాత ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశా. ఆ తరువాత ఎంఏ ఇంగ్లీష్‌, ఎంఎడ్‌ పూర్తి చేశా. ఇదంతా బాగుంది అనుకున్న నాకు.. పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి  ఎంతో బాధపడ్డా. ఆ సమయంలో వంశీ నాకు ధైర్యం చెప్పాడు. సమాజంలో నీలాంటి వారెంతో మంది అనాథలు ఉన్నారు. వారి కోసం ఎందుకు పని చేయకూడదని ప్రశ్నించాడు. అక్కడి నుంచి నా జీవితం అనాథల హక్కుల కోసం పోరాటం వైపు మళ్లింది..


అనాథల హక్కుల కోసం పోరాడుతూ... 

అనాథల హక్కుల కోసం గాదె ఇన్నయ్య గారు ’ఫోర్స్‌’ అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థలో నేషనల్‌ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నాను. రాజ్యాంగంలో అనాథల కోసం ఎలాంటి హక్కులు కల్పించలేదు. వారికి హక్కులు కల్పించాలని, ప్రభుత్వమే వారికి అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని, తల్లిదండ్రులుగా ఉండాలన్నది మా ఉద్దేశం. ఇప్పటికే ఉప రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంతో మందిని కలిసి వినతిపత్రాలు అందించాం. ’వీ ఫర్‌ నీడీ’ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేశాను. నా జీవితమంతా అనాఽఽథల కోసమే పని చేస్తూ ఉంటా.’’ 

 అయితగోని శ్రీనివాస్‌ గౌడ్‌ 


Updated Date - 2022-03-10T05:30:00+05:30 IST