‘జగనన్న’పై పోరాటంలో మహిళలకు హైకోర్టు ‘చేయూత’

ABN , First Publish Date - 2021-12-04T06:24:46+05:30 IST

జగనన్న చేయూత పథకాన్ని రాజకీయ కక్షతో అడ్డుకున్నా హైకోర్టుకెళ్లి విజయం సాధించిన బీసీ మహిళల విజయగాథ ఇది.

‘జగనన్న’పై పోరాటంలో మహిళలకు హైకోర్టు ‘చేయూత’
కొటాలలో విచారణ జరుపుతున్న అధికారులు (ఫైల్‌ఫొటో)

కలికిరి, డిసెంబరు 3: జగనన్న చేయూత పథకాన్ని రాజకీయ కక్షతో అడ్డుకున్నా హైకోర్టుకెళ్లి విజయం సాధించిన బీసీ మహిళల విజయగాథ ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్లేయలేదని పత్తేగడ పంచాయతీ కొటాల గ్రామంలోని 11 మంది మహిళలకు జగనన్న చేయూత పథకం సాయం రాయకుండా వలంటీరు ద్వారా అడ్డుకున్నారు. గత ఏడాది అర్హులైన ఈ 11 మందిని ఈ దఫా అనర్హులుగా చేశారు. దీంతో వారంతా జూన్‌ 19న ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీడీవో, ఈవోపీఆర్డీ గ్రామంలో విచారించి మహిళల వాదన నిజమేనని, వారంతా పథకానికి అర్హులేనని తేల్చారు. అయితే మహిళలకు మాత్రం లబ్ధిచేకూరలేదు. దీంతో గ్రామానికి చెందిన టీడీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ  ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌తో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిశోర్‌కుమార్‌ రెడ్డిని ఆశ్రయించారు. ఆయన చొరవ తీసుకుని హైకోర్టులో కేసు వేయించారు. చివరికి 11 మంది మహిళలకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో బాధిత మహిళలకు వెంటనే ఆసరా నిధులను విడుదల చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ‘సెర్ప్‌’ సీఈవోను ఆదేశించారు. ఆ మేరకు ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే ఒక్కో మహిళ ఖాతాలో రూ.18,700 వంతున ఆరు నెలల ఆలస్యంగా నిధులు జమయ్యాయి. 






Updated Date - 2021-12-04T06:24:46+05:30 IST