అవసరమైతే ఎస్పీకి మద్దతు

ABN , First Publish Date - 2022-01-24T06:36:23+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి అవసరమైతే మద్దతు ఇస్తామని, ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా అన్నారు...

అవసరమైతే ఎస్పీకి మద్దతు

ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధం: ప్రియాంక

ముఖ్యమంత్రి అభ్యర్థి తాను మాత్రమే కాదని వెల్లడి


లఖ్‌నవూ, జనవరి 23: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి అవసరమైతే మద్దతు ఇస్తామని, ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా అన్నారు. అయితే మహిళలు, యువకులకు కాంగ్రెస్‌ అజెండాను అమలు చేస్తామన్న షరతులకు ఎస్పీ ఒప్పుకోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ తాను మాత్రమే సీఎం అభ్యర్థి కాదని వెల్లడించారు. ‘‘యూపీ సీఎం అభ్యర్థి నేనే అని చెప్పడం లేదు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ మీడియా ప్రతినిధులు అదేపనిగా ప్రశ్నించడంతో నేను విసుగు చెంది అలా ప్రకటించాను’’ అని ప్రియాంక చెప్పారు.


యూపీలో కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయం: మాయావతి

యూపీలో కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆ పార్టీ సీఎం అభ్యర్థిని కొన్ని గంటల్లోనే మార్చడమే ఇందుకు నిదర్శనమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓట్లను కాంగ్రె్‌సకు వేసి వృథా చేయకుండా ఉంటే మంచిదని ట్విటర్‌లో ఆమె పేర్కొన్నారు. బీజేపీని ఓడించి, బీఎస్పీకి అధికారం ఇవ్వాలని ఆమె కోరారు. ఇక.. యూపీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్‌ (ఎస్‌) తన మొదటి టికెట్‌ను ముస్లింకు ఇస్తామని ప్రకటించింది. రామ్‌పూర్‌ జిల్లాలోని సువార్‌ నుంచి హైదర్‌ అలీ ఖాన్‌ను నిలబెడతామని తెలిపింది. మరోవైపు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గత కొన్నేళ్లలో కాంగ్రెస్‌ నేతలు కాషాయ పార్టీకి మారిన నేపథ్యంలో ఆ పార్టీ అప్రమత్తమైంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారబోమంటూ తన అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ దేవుడి ఎదుట ప్రమాణం చేయించింది. మొత్తం 34 మంది అభ్యర్థులను పణజిలో ఓ ప్రత్యేక బస్సులో దేవాలయం, చర్చి, దర్గాకు తీసుకెళ్లి వారితో ప్రతిజ్ఞ చేయించింది.

Updated Date - 2022-01-24T06:36:23+05:30 IST